CONCEPT

భావన

గుర్రం జాషువా (1895-1971) కవి

గుర్రం జాషువా (1895-1971) కవి









కుల మత విద్వేషంబుల్ తలసూపని తావులే కళారాజ్యంబుల్ 
కళ లాయుష్మంతములై యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!
చక్కని కవితకు కులమే యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం
కెక్కడి ధర్మము తల్లీ? దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ -
నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూ
రే ఖా కమనీ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్



గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న
న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే
యవ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్ -
ఖండకావ్యం కవి శక్రేశుడు గండపెండెరములన్గాంగేయ తీర్థంబులన్
వివిధోపాయన సత్కృతుల్ గొనిన గాంధీ శాంతి సిద్ధాంత మా ర్థవ మార్గటుడు 
గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా నవతా స్రష్టన్
 నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్ ---
జాషువా తన గురించి చెప్పుకున్న పద్యమిది. కవులు, రచయితలు తాము ఎన్ని రచనలు చేసినా, వాటిలో తమకు నచ్చిందీ, ప్రజలు మెచ్చిందీ, ఆ కవికి లేక రచయితకు కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టిందీ అయిన రచనలు సాధారణంగా ఒకటో, రెండో ఉంటాయి. అలాంటి రచనల్నే 'జీవిత కృతులు' (Life Works) అని అంటాం. ఆ కవి భావనా సర్వస్వం, కవితా శిల్ప సౌందర్యం సమస్తం, గుత్తకు కొన్న కావ్యం అదే అయి ఉంటుంది. జాషువా ఇంచుమించు ముప్ఫై పై చిలుకు గ్రంథాలు రచించాడు. సర్వ పండితామోదముగా రచియించితిని (వి) ముప్పది కావ్యములు (నా కథ-158). అయినా ఆయన ఆమరణాంతం చెప్పుకున్న కావ్యం "గబ్బిలమే". ప్రజలు మెచ్చి ప్రశంసించిందీ "గబ్బిలాన్నే". అందువల్లే, 'గబ్బిలం' జాషువా జీవిత కృతి. అంతేకాదు, ఆయన రచనలల్లోనే అది 'శిరశ్శేఖర కృతి' (Monumental work) కూడా! జాషువా మిగిలన రచనలన్నీ ఒక ఎత్తు, 'గబ్బిలం' ఒక్కటీ ఒక ఎత్తు. జాషువా జీవిత ప్రస్థానానికీ, సామాజిక దర్శనానికీ నిదర్శనంగా నిలిచేది ఈ 'గబ్బిలం' కావ్యం.
గురజాడ తో 'కావ్య ఖండిక' ల రచన (1910) ఆరంభమైనా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావు చేతిలోనే మొలకెత్తింది. అది జాషువా చేతిలో పుష్పించి ఫలించింది. ఖండకావ్య రచనలో అఖండ ప్రతిభా సంపన్నుడు జాషువా! ఆయన ఖండకావ్యాలు అటు రాసి లోను, ఇటు వాసి లోను మిన్న అయినవే. ఫిరదౌసి, గబ్బిలం, కాందిశీకుడు, ముంతాజమహలు, నేతాజీ, ముసాఫరులు మొదలైన ఖండకావ్య రచనలతో పాఠకలోక ప్రాచుర్యాన్ని చూరగొన్న కవి జాషువా. వీటిల్లో "గబ్బిలం" రెండు భాగాలున్న ఖండకావ్యం. మొదటి భాగంలో సుమారు 117 పద్యాలు, రెండవ భాగంలో 142 - మొత్తం 259 పద్యాలున్న గబ్బిలాన్ని లఘుప్రబంధం అనవచ్చు. మొదటి భాగం 1941 లోను, రెండవ భాగం 1946 లోను రచించబడ్డాయి.
CONCEPT ( development of human relations and human resources )