Sunday

9.స్త్రీ - భావన


 














చలం
స్త్రీ - చలం  చేసినంత ఆలోచన ఇంకా ఎవరు చేయలేదు.( స్త్రీ - స్వేచ్చా - బాధ్యత, చలం దృష్టి లో  విడదీయరాని అంశాలు )   

*మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు.
  1. చలాన్ని ఇవాళేదో ప్రత్యేకంగా నిర్వచించాలనీ కూడా కాదు, లేదా సమర్ధించాలని కూడా కాదు. కానీ గమనించండి మీరు, చలం వివాహ వ్యవస్థని నమ్మిన వాడు కాదు. దాన్ని ఆచరించిన వాడూ కాదు. తన కూతుళ్లకి ఎప్పుడూ ఆయన పెళ్ళి ఊసు తలపెట్ట లేదు సరికదా పెళ్ళిళ్ళు చేసుకోకండని వారితో చెప్పిన వాడు. తాను నమ్మిన వాటినే ఆయన ఆచరించి బతికాడు. వివాహవ్యవస్థ మీద తిరుగుబాటు చేసిన వ్యక్తిని మనం ఆ ప్రమాణాలతో చూసే వీలు లేదు. చలం రాసిన వాటిని మీరు ఒప్పుకోకపోవచ్చు. చలాన్ని మీరు విమర్శించవచ్చు. కానీ చలం ఒక గృహస్తు లాగా బతకడానికో, అలాంటి ఒక విషయాన్ని “ఆదర్శం” గా చూపించడానికో ఏనాడూ ప్రయత్నం కూడా చేయలేదు. అందుకోసం ఆయన తన రచనలు చేయలేదు. 

     ఆయన వెనకటి రచనల ప్రస్తావన చెసినప్పుడు చలం మళ్ళీ ఆ రచనలనే చేయవలసి వస్తే అంతకన్నా మరింత ఘాటుగా ఎలా రాయాలా అని ఆలోచిస్తానని అన్నాడు! అలాంటి వారితో కలిసి జీవించడం ఆయన భార్యకి అంత సులువైన విషయమేమీ కాదు, నిజమే. అయినా, ఆవిడ మీరు ఆశించినట్టు గా ఎందుకని “విముక్తి” అనుకుంటూ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోలేదో! మీరు చూడని అంశమేదో ఆమె తన భర్తలో బహుశా చూడగలిగిందేమో మరి! లేకపోతే రంగనాయకమ్మ గారు అన్నేళ్ళు చలంతో సహజీవనం చేయగలిగేది కాదు కదా?
    మీరు చలాన్ని విమర్శించిన దానికన్నా ఎక్కువగా చలం తనని తాను విమర్శించుకున్నాడు. ఆయన తన ఆత్మకధని మొదలుపెడుతూ అన్న మాటలని ఎప్పుడైనా చదివిచూడండి. ఆయన అభిప్రాయాలు ఆయన రాసిన “బిడ్దల శిక్షణ” లోనీ “స్త్రీ” లోనీ ఆయన ఆత్మకధ లోనీ స్పష్టం గానే ఉన్నాయి.
    చలం వివాదాస్పదం కావడానికి ఆయన “శృంగారం” గురించి రాయడం కారణం కాదు. చలం కన్నా ముందు తెలుగు సాహిత్యం నిండా ఉన్నది శృంగారమే!! వాటిని ఎవరూ తిట్టలేదేం? ఎందుకంటారూ?? ఎందుకంటే వాటి పాఠక వర్గం లో స్త్రీలు లేరు. కనీశం స్త్రీలు ఉండొచ్చును అన్న స్పృహ కూడా ఆ ప్రాచీన “శృంగార” రచయితలకి లేదు. ప్రాచీనమేం ఖర్మ ఆధునిక రచయితలకీ చాలామందికి లేదు. ఆనాటి రచనలన్నీ పురుషుల కోసం పురుషులు రాసుకున్న శృంగార రచనలు. కొద్దో గొప్పో స్త్రీలు రాసినా వారు కూడా ఆ శృంగార చట్రాన్నే ఒప్పేసుకుని ఆ తరహాలోనే తాము సైతం రచించిన శృంగారం! కానీ చలం రచనల్లోని స్త్రీపురుష సంబంధాలు అంతకు మునుపటి రచనలలో లేనివి. స్త్రీల అనుభవం గురించిన ఆలోచనలని తొలిగా సాహిత్యంలో ప్రస్తావన చేసిన రచయిత వెంకటచలంగారే ! ఆయన రాసిన వాటిని బాహాటంగానో, రహస్యంగానో ఎలాగో అలాగ ఆయన కాలం నాటి స్త్రీలు మాత్రం స్వయంగా చదివారు. చదవడమే కాదు వాటిని వారు నచ్చుకున్నారు. ఆ రాసిన వ్యక్తిని కలవడానికీ ఆయనని చూడడానికీ ఆయనతో మాట్లాడడానికీ తెలుగు సమాజం లోని స్త్రీలు స్వతంత్రించి ధైర్యంగా ప్రయత్నం కూడా చేశారు. దీనినే “ప్రభావితం కావడం” అని అంటారు. ఇలా కేవలం “శృంగారం” రాయడం మాత్రమే కాక ఆయా స్త్రీలు మోస్తున్న కుటుంబవ్యవస్థ లోని లోటుపాట్లని చలం బయట పెట్టడం వలన, వాటిని చదివిన ఆడవాళ్ళు ఎక్కడ కుటుంబాలని వదిలి వెళ్ళిపోతారో అని తెలుగు సమాజం కలత చెంది చలాన్నీ, అతని రచనలనీ నిందించడం జరిగింది. కానీ పాపం! ఏదీ? చలం రచనలని చదివి ఏ భార్యా కుటుంబాలని వదిలి వెళ్ళిపోలేదు. చివరికి చలం భార్యతో సహా :)

    rama bharadwaj వారి సౌజన్యంతో 

    స్త్రీ ఒక తల్లికి కూతురు, ఒక శిశువుకు తల్లి, ఒక అన్నకు చెల్లి, ఒక తమ్మునికి అక్క, ఒక పురుషునికి భార్య, ప్రియురాలు, ఒక అత్తకు కోడలు. ఇలా స్త్రీకి ఎన్నో అవతారాలు. పురుషునితో సమానంగా ఇప్పుడు స్త్రీలు కూడ ఆఫీసులలో, కంపెనీలలో, కళాశాలలో పని చేస్తున్నారు, కానీ తక్కువ వేతనంతో. సంఘంలో స్త్రీని ఇంకా ఒక ఆటవస్తువుగానే కొందరు భావిస్తున్నారు. స్త్రీ హృదయంలో కలిగే భావాలు, క్షోభలు, సుఖ దుఃఖాలు, కన్నీళ్లు, ప్రేమలు, కామాలు - ఇవన్నీ కవితకు మంచి సారవంతమైన క్షేత్రం. ఒక వంద సంవత్సరాలుగా స్త్రీల కవితలు ఎంతగానో ముందడుగు వేసింది. స్వాతంత్ర్యానికి ముందు ముగురమ్మలు దీనికి మూలకారకులు. వారు - విశ్వసుందరమ్మ, బంగారమ్మ, సౌదామిని. మచ్చుకు వారి కవిత ఒకటి కింద ఇస్తున్నాను. సౌదామినిగారి “దురదృష్టాన్ని” చదివిన తరువాత కళ్ల నీళ్లు బెట్టుకోని వాళ్లు అరుదుగా ఉంటారు.
    అరమరలేని మన చిరతర స్నేహరుచుల్
    కురిసిన వెన్నెలలా, అరవిరిసిన మల్లియలా
    మనమున నెవ్వగలే మాసెను ఘనమగు నెయ్యములో
    మెరపుల గుంపేమో అది కరగని వెలుగేమో
    దినములు నిముసములై చనియెను తిన్నని నడకలతో
    కన్నుల తళుకేమో అది పున్నెపు ప్రోవేమో
    జీవితమున కంతా అది చెలువపు నిగ్గేమో
    పరమ ప్రేమకు చిహ్నమైన తెలి వెన్నెల కాంతుల సన్నపు తళుకేమో
    - విశ్వసుందరమ్మ, స్నేహరుచి
    కను మూసి లేచాను వెనుదిరిగి చూశాను
    కనలేదు ఆ జంట, వినలేదు ఆ జాడ
    గుండె గుబగుబ లాడెను
    నా గొంతు
    ఎండి గుటకడదాయెను
    పిలిచాను పిలిచాను అలసిపోయాను
    అలసిపోయిన గుండె అట్టె ముడిపోవ
    ఆకాశమున కెగిరితి
    అక్కడా
    అంధకారమె చూసితి
    కేక వినబడదాయె చూపు కనబడదాయె
    అంధకారములోన అట్టె రెక్కలు ముడిచి
    అవనిపై బడితిని
    అక్కడా
    అంధకారమె గంటిని
    - బంగారమ్మ, తమస్సు
    చూచితి మెంతో దేశము
    సుఖము, శాంతి దొరకునొ యని
    మునిగితి మెన్నో నదులను
    మోక్షము చేపట్టుద మని
    ఎక్కితి మెన్నో కొండల
    నీశ్వరు దర్శింతా మని
    మ్రొక్కితి మెన్నో వేల్పుల
    కొక్క పండు వర మిమ్మని
    నోచితి మెన్నో నోములు
    కాచి బ్రోచు నని పార్వతి
    కడకు దేవి దయచేతను
    కంటిమి రత్నములు రెండు
    బతుకు కలంకారముగా
    వాని దాచ చేతగాక
    ఎచటనొ పోగొట్టుకొంటి
    మెంతటి దురదృష్టముననొ
    - సౌదామిని, దురదృష్టము
    అరవైయవ దశకమునుండి స్త్రీల కవిత్వము, స్త్రీవాద కవిత్వము తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నది. జయప్రభ, ఓల్గా, రేవతిదేవి, ఈశ్వరి, సావిత్రి వంటి కవులు ఒక కొత్త చేవను, బలాన్ని, దృక్పథాన్ని సాహిత్యంలో సృష్టించారు. అమెరికాలాటి విదేశాల్లో ఉండే స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో ముఖ్య పాత్రలే. వీరి కవితలను చదువుతుంటే ఒక కథను చదివేలా అనుభూతి కలుగుతుంది. కింద కొన్ని కవితాభాగాలను ఉదాహరణలుగా ఇస్తున్నాను.
    ….
    ఇద్దరి రక్తమూ ఎర్రగానే వుంది
    ఇద్దరి రక్తమూ వేడిగానే వుంది
    ఇద్దరి రక్తమూ ఉప్పగానే వుంది
    అంతే
    ఆ తర్వాతెప్పుడూ అనుకరించలేదు నా పూజ్య పూర్వీకుల్ని
    ఆలోచించేవాణ్ణి శాస్త్రీయంగా నా మేధస్సుతో నేను
    ఆచరించేవాణ్ణి ఏది సమంజసమనిపిస్తే దాన్ని
    అనుసరించేవాణ్ణి ఏది యోగ్యమనిపిస్తే దాన్ని
    - పెళ్ళకూరు జయప్రద, నేస్తం ఆలోచించు
    అది రాత్రి సరిగ్గా రెండు నిలువు గీతల సమయం
    కొబ్బరాకుల నిలువు పాపిట మీద
    మంచు బొట్టొకటి మిసమిసా నాకేసి చూస్తోంది
    ఎదలోపల ఎక్కడో ఖరీదైన జ్ఞాపకం కాలుతోంది
    గుండెలోపల పండిన మొగలిరేకు గుచ్చుకొన్నట్లు
    చివ్వుమన్న బాధ రివ్వుమన్న సువాసన

    - కొండేపూడి నిర్మల, నిద్రపట్టని రాత్రి
    పురుషుడికి అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయి
    అందచందాలున్నాయి
    గుణగణాలున్నాయి
    తెలివితేటలున్నాయి
    అవన్నీ పురుషుడికి
    తల్లిగా
    ప్రేయసిగా
    స్త్రీ ఇస్తుంది
    అన్ని ఇచ్చి
    చివరికి
    మగాడి చేతిలో
    ఆటబొమ్మవుతుంది
    - రేవతీదేవి, స్త్రీ
    పాఠం ఒప్పజెప్పకపోతే
    పెళ్లి చేస్తానని
    పంతులుగారన్నప్పుడే భయం వేసింది
    ఆఫీసులో నా మొగుడున్నాడు
    అవసరమున్నా సెలవివ్వడని
    అన్నయ్య అన్నప్పుడే
    అనుమానం వేసింది
    వాడికేం మహారాజని
    ఆడా మగా వాగినప్పుడే
    అర్థమయిపోయింది
    పెళ్లంటే పెద్ద శిక్షని
    మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
    మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
    మమ్మల్ని విభజించి పాలిస్తోందని
    - సావిత్రి, ఒక ఆడపిల్ల స్వగతం
    నీకూ మంచి రోజు లొస్తున్నాయిరా కన్నా
    ఆడదిగా పుట్టనని అడవిలో మానైనా కాలేదని
    విలపించే రోజులు
    పోతున్నాయిలే తల్లీ
    ఎందుకంటే
    నీవు అమ్మ పొట్టలోంచి
    బైటికే రావుగా
    - ఈశ్వరి
    ఏమిటీ అలా వెతుకుతున్నావు
    ఆ రంగుటద్దాలు తీసేసి
    నా కళ్లు పెట్టుకొని
    నీలోకి చూసుకో
    తెలుస్తుంది -
    నీలో సగం నేనేనని
    - ఇందిర కొల్లి, నీవు నేను
    గుడిపాటి వెంకటాచలం (1894–1979), సాహిత్య లోకంలో 'చలం'గా సుప్రసిద్ధుడు, ఆధునిక తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక రచయిత, వేదాంతి, సంఘ సంస్కర్త మరియు స్త్రీవాద ఆలోచనలకు బీజం వేసిన అసాధారణ వ్యక్తి. ఆయన జీవితం, సాహిత్య రచనలు, సామాజిక దృక్పథం ఒకదానితో ఒకటి ముడిపడి, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఈ రోజు చలం గారి వర్ధంతి జ్ఞాపకం!

            🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

     
    చలం గారు 1894 మే 18న మద్రాసులో కొమ్మూరి సాంబశివరావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వారి తాత గారు గుడిపాటి వెంకట్రామయ్యకు దత్తత వెళ్లడంతో ఆయన గుడిపాటి వెంకటాచలంగా మారాడు. తెనాలిలో ఆయన బాల్యం సాగింది. చిన్నతనంలోనే తండ్రి నుండి కఠిన శిక్షలు ఎదుర్కొన్నాడని, తల్లి తాత ఇంట్లో ఎక్కువగా ఉండేదని ఆయన 1972లో రాసిన ఆత్మకథ "చలం"లో వివరించాడు. ఈ అనుభవాలు ఆయన మానసిక ఆలోచనలపై గాఢ ప్రభావం చూపాయి.
    .......
    చలం  గారు వృత్తిరీత్యా  ఉపాధ్యాయుడు. చలం గారి రచనలు మిగతా రచయితల రచనలకు భిన్నమైనవి. ప్రత్యేకించి వీరూ రాసే వచనం లో ఎక్కువ కవితాత్మంగా వుండి ఆసక్తీకరంగా చదివించేస్తుంది. చలం కు ఆత్మకథలు అంటే ఇష్టముండదు. అయినా సరే తనమీద తానే ఒక పుస్తకాన్ని వ్రాసి (1972), దానికి "చలం" అని పేరు పెట్టాడు. వారి మాటలోనే చెప్పాలంటే 
    ఆత్మకథలంటే నాకసహ్యం....

    ఆత్మకథ వ్రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషైనట్టు, తానేదో ప్రజలకి తీరని ఉపకారంచేసినట్టు,
    తన సంగతి చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు, తెలియకపోతే లోకానికి నష్టమైనట్టు అనుకొంటున్నాడన్న మాట,రాసినవాడు ఎందుకు పుట్టానా పుట్టినవాణ్ణి చప్పున చావక ఎందుకింత కాలం తన పరిసరాలని ఇంత కల్మషం చేశానా అనుకునే నావంటివాడు తనకథ సిగ్గులేకుండా
    చెప్పుకొంటున్నాడంటే ఏమాత్రం క్షమించదగిన విషయం కాదు.
    .....
    నిజానీకీ సంప్రదాయ కుటుంబం లో పుట్టిన చలం మొదట్లో 
    నిష్ట గరిష్టుడిగా వుండేవాడు. తన చెల్లెలు పెళ్ళి అర్ధంతరంగా ఆగిపోవడం. ఇంట్లో కలతలు ఇవ్వన్ని కూడా తనను సంప్రదాయ నిరసన కు దారితీసింది. స్త్రీల పట్ల న్యాయ విచక్షణ వైపు మళ్ళించింది.
    ......
    ఇక చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని తీవ్ర విమర్శల పాలు అయినాడు. అంతేకాదు వ్యక్తీగతంగా చలం గురించి తెలిసిన వారూ ఎవ్వరూ ఆతనినీ దగ్గరకు రానిచ్చేవారూ కాదట. పోనీ కుటుంబ సభ్యుల జీవితాలు అయిన సరిగ్గా ఉన్నాయా అంటే అదీ కూడా అంతంతా మాత్రమే. వీరి పెద్ద కొడుకు (రవి ) చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు. రెండవ కొడుకు (వసంత్ ) దురలవాట్లకు బానిసై, ఇల్లు వదలి ఎటో వెళ్ళి పోయాడు. ఇక కూతురు సౌరిస్ అయితే వివాహమే  చేసుకోలేదు. సన్యాసినిగా మారింది. ( ఈవిడే చలం చనిపోయాక దాహన సంస్కారాలు జరిపించారు) ఇలాంటి సమస్యలున్న చలం గారు పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయం మీద " *బిడ్డల శిక్షణ*  అనే పుస్తకం రాయడం విచిత్రం!

    • చలం గారి జీవితం ఒక అసాధారణ ప్రయాణం.....

    చలం విద్యాభ్యాసం సాంప్రదాయికమైనది కాగా, ఆయన 
    ఆంగ్ల సాహిత్యం, పాశ్చాత్య తాత్విక రచనల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ జ్ఞానం ఆయన రచనల్లో స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం, సామాజిక నీతి వంటి అంశాలను ప్రశ్నించే ధోరణిని పెంపొందించింది.

    • వ్యక్తిగత జీవితం.....

    చలం వ్యక్తిగత జీవితం వివాదాస్పదమైనది. ఆయన వివాహం రంగనాయకమ్మతో జరిగింది, కానీ ఆయన ప్రేమ, స్త్రీ-పురుష సంబంధాలపై రాడికల్ ఆలోచనలు కుటుంబ జీవితంలో ఒడిదొడుకులను తెచ్చాయి. ఆయన పెద్ద కొడుకు రవి చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించాడు, మరొక కొడుకు వ్యసనాలకు లోనై ఇంటిని వదిలిపెట్టాడు, కూతురు సౌరీస్ సన్యాసినిగా మారింది. ఈ వ్యక్తిగత దుర్ఘటనలు చలం జీవితంలో ఒంటరితనం, మానసిక సంఘర్షణలను జోడించాయి. చలం జీవితంలో చివరి దశలో ఆధ్యాత్మికత వైపు మొగ్గాడు. నాస్తికవాది, హేతువాదిగా మొదట్లో ఉన్న ఆయన, రమణ మహర్షి ఆశ్రమంలో అరుణాచలంలో స్థిరపడ్డాడు. ఈ ఆధ్యాత్మిక మలుపు ఆయన రచనల్లో కూడా కొంత ప్రతిఫలించింది.

    • సాహిత్య జీవితం: విప్లవాత్మక రచనలు.....వారి శైలి మరియు ఇతివృత్తాలు....

    చలం గారి రచనలు నవలలు, కథలు, నాటకాలు, వ్యాసాలు, కవితలు, ఉత్తరాలు, ఆధ్యాత్మిక రచనలు వంటి వివిధ రూపాల్లో విస్తరించాయి. ఆయన అత్యంత ప్రసిద్ధ రచనల్లో కొన్ని:

    • చలం రచనలు ....

    * 1) నవలలు....

    1) మైదానం (1928)
    2) అరుణ (1939)
    3) వివాహం (1928)
    4) శశిరేఖ (1921)
    5) దైవమిచ్చిన భార్య (1923)
    6) అమీనా (1924)

    *2) నాటకాలు....

    1) పూరురవ    2)  పద్మరాణి
    3) వేలియాలి అబద్దాలు
    4) చిత్రాంగి       5) జయదేవ
    6) శశాంక  7) జానకీ వేదన (రష్యన్ భాష లో )

    *3) కథలు.....

    1) మా కర్మ ఇట్లా కాలింది (1925)
    2) మధుర మీనాక్షి (1925)
    3) విడాకులు (1938)
    4) కన్నీటి కాలువ (1924)
    5) హంపీ కన్యలు
    6) సినిమా జ్వరం
    7) చక్కనమ్మ కథ (నార్వే భాషలో)
    8) ఓ పూవు పూసింది

    * 4) ఇతరములు* :-
    1) సుధ (కావ్యం )
    2) విషాదం ( వ్యాస సంపుటి )

    చలం రాసిన దోషగుణం కథ ఆధారంగా " గ్రహణం" అనే సినిమా వచ్చింది. దీనికీ  ఇంద్రగంటి మోహన్కృష్ణ  దర్శకులు. అలాగే  "మైదానం" నవలను తనికెళ్ళ భరణి గారు సిన్మా తీయాలనీ ప్రయత్నించారు. కానీ ఎందుకో అదీ కార్య రూపం దాల్చలేదు.
    .....
    చలం గారి రచనలు స్త్రీల జీవితాలు, సమాజంలో వారు ఎదుర్కొనే శారీరక, మానసిక హింసలు, స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, సంబంధాలు, సామాజిక హిపోక్రసీ వంటి ఇతివృత్తాల చుట్టూ తిరుగుతాయి. ఆయన శైలి సహజమైనది, భావోద్వేగంతో కూడినది, తాత్విక లోతును కలిగినది. ఆయన భాషలో అసాధారణమైన సౌందర్యం, స్వేచ్ఛ ఉండేవి, ఇది సమకాలీన రచయితలను కూడా ఆకర్షించింది

    • స్త్రీవాద దృక్పథం.....

    చలం రచనలు స్త్రీల సమస్యలను కేంద్ర బిందువుగా చేసుకున్నాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ, సాధికారత అవసరాన్ని గట్టిగా ప్రతిపాదించాడు. "మైదానం" నవలలో రాజేశ్వరి అనే పాత్ర సాంప్రదాయిక బంధనాలను తెంచుకుని స్వేచ్ఛను ఎంచుకోవడం ఆనాటి సమాజంలో తీవ్ర చర్చను రేకెత్తించింది. ఈ రచన సాంప్రదాయ వాదుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, స్త్రీ స్వాతంత్ర్యానికి ఒక బలమైన స్వరంగా నిలిచింది.
    ......
    చలం గారి రచనల్లో స్త్రీ-పురుష సంబంధాలు, ప్రేమ, శృంగారం గురించి బహిరంగంగా చర్చించడం ఆనాటి సమాజంలో విప్లవాత్మకం. ఆయన స్త్రీలను గౌరవించాలని, వారి ఆలోచనలకు విలువ ఇవ్వాలని పదేపదే నొక్కి చెప్పాడు. అయితే, ఈ బహిరంగ చర్చ సమాజంలో అపార్థాలకు దారితీసింది, ఆయన రచనలను "బూతు సాహిత్యం"గా ముద్రవేసింది

    • మ్యూజింగ్స్: తాత్విక ఆలోచనల సంగ్రహం.....

    చలం రచనల్లో "మ్యూజింగ్స్" ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1937-1955 మధ్య రాసిన ఈ వ్యాస సంపుటి ఆయన తాత్విక ఆలోచనలు, సామాజిక విమర్శ, వ్యక్తిగత అనుభవాల సమ్మేళనం. గాంధీయిజం నుండి కమ్యూనిజం వరకు, స్త్రీ-పురుష సంబంధాల నుండి ఆధ్యాత్మికత వరకు విస్తృత అంశాలను చర్చించాడు. ఈ రచనలో ఆయన సమాజంలోని మాయమైన పొరలను చీల్చి, సత్యాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు.

    • సమాజంపై ప్రభావం మరియు వివాదాలు.....సామాజిక ప్రభావం.....

    చలం రచనలు తెలుగు సమాజాన్ని ఒక తుఫానులా ఊపేశాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ, సామాజిక హిపోక్రసీ, కట్టుబాట్లపై చేసిన విమర్శలు యువతను ఆలోచింపజేశాయి. ఆయన రచనలు బహిరంగంగా చదవడానికి సమాజం భయపడిన రోజుల్లో కూడా, ఆసక్తిగల పాఠకులు రహస్యంగా చదివేవారు. చలం సాహిత్యం స్త్రీల హక్కుల గురించి, సామాజిక సంస్కరణల గురించి చర్చలను రేకెత్తించింది

    • చలం  గారి కవిత్వం.....

    ఈ విషయం కు వస్తే వీరి కవితలలోని తాత్వికత శైలి అందరినీ విస్మయపరుస్తుంది. వీరి  రచనాశైలీ ఇతివృత్తం ప్రభావితం గా వుంటుంది.

    చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…

    • వానరాత్రి కవితలో ఏమంటారో చూడండి…

           ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు
            వీస్తోంది గాలి
            నల్లని రాత్రి ఇంకా నల్లని
            మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది
             హోరుమని అరుస్తో వాన
             తలుపులు మూసి దీపం వెలిగించుకున్న
             వాన లోపలికి వస్తానని పంతం పట్టి
              తలుపు మీద ఈడ్చి కొడుతోంది
             తెరవమని కొంచం మర్చిపోతుంది
             మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును
             దబదబా బాదుతుంది
             నా విరహ బాధని
             ఈ రాత్రిలో కలిపెయ్యలేను?

    వీరి కవిత్వం సామాన్యంగా ఆలోచిస్తే అర్ధం కాదు. స్థూలంగా అర్ద్రత తో రాసే వీరి కవిత్వం అసామాన్యం. బసవరాజు అప్పారావు గారనట్లు  ఒక గొప్ప కవిత్వపు పంక్తి కొసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు అనడం లోనే చలం ప్రత్యేకత తెలుస్తుంది. ఎంతో మంది ఠాగూర్ "*గీతాంజలి*" నీ తెలుగు లో అనువదించారు. అయినప్పటికీ చలం తన శైలి లో రాసిన అనువాదమే ఇప్పటికీ ప్రత్యేకమైనదిగా  తెలుగు సాహితీ వేత్తలు భావిస్తారు.

           "వొంటి పై రాజ వస్త్రాలు
            మెడలో బంగారు హారాలు
            ధరించిన బాలుడికీ
            ఆటలో సంతోషం ఎట్లా కలుగుతుంది
            ప్రతి అడుగునా ఆతని దుస్తులు
           అతనికీ అడ్డు పడతాయి" 

           " నా పాట అలంకారాల్ని విసర్జించింది
             నగల్ని చీరల్ని చూసీ గర్వపడదు
             ఆభరణాలన్ని మన
             ఐక్యన్నీ చేరుపుతాయి
            నీకూ నాకు మధ్య అవి అడ్డం
              నీ రహస్య వాక్కుల్ని వినపడకుండా
              చేస్తుంది గల గల*"

    • చలం రచనల పై *పరిశొధనలు* కూడా జరిగాయి...

    1) చలం నవలలు - సామాజిక చైతన్యం - మైనవరం ఈదారెడ్డి
    2) చలం సాహిత్యం అక్షరాభిషేకం - గొర్రెంపాటి వెంకట సుబ్బయ్య.

    • వివాదాలు.....

    చలం రచనలు సమాజంలో తీవ్ర వివాదాలను సృష్టించాయి. ఆయన స్త్రీ స్వేచ్ఛ పేరుతో "విశృంఖల జీవన విధానాన్ని" ప్రచారం చేస్తున్నాడని, ఆయన రచనల్లో అశ్లీలత ఉందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ఆయనను సామాజికంగా ఒంటరిని చేశాయి. సమాజం ఆయనను అపార్థం చేసుకున్నప్పటికీ, ఆయన తన ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేశారు.
    ......
    విశ్వనాథ సత్యనారాయణ వంటి సాంప్రదాయవాద రచయితలు చలం రచనలకు వ్యతిరేకంగా "చెలియలికట్ట" వంటి రచనలు చేశారు. అయినప్పటికీ, విశ్వనాథ సత్యనారాయణ చలం భాషా నైపుణ్యాన్ని ప్రశంసించారు, "తెలుగు రచయితల కంటే చలంకు భాష బాగా వచ్చు" అని అన్నారు

    • ఆధ్యాత్మిక మలుపు.....

    చలం గారి స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. ఈ విషయాలపై  చలం చివరి దశలో వున్నప్పడూ తీవ్ర పశ్చత్తాపపడ్డాడు. రచనల ను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు.ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు. మొదటి నుంచి నాస్తికభావాలతో సతమతం అయ్యి దైవం పై అపనమ్మకం తో విప్లవాత్మక ఆలోచనలు వున్న చలం జీవితంలో చివరి దశలో ఆధ్యాత్మికత వైపు మొగ్గాడు. ఆయన నాస్తిక భావాల నుండి రమణ మహర్షి ఆశ్రమంలో ఆధ్యాత్మిక సంతృప్తిని పొందాడు. ఈ మార్పు ఆయన రచనల్లో కూడా కొంత ప్రతిఫలించింది, ముఖ్యంగా "చలం గీతాలు", "సుధ" వంటి రచనల్లో

    • విశ్లేషణ: చలం సాహిత్యం యొక్క ప్రత్యేకత....

    1. విప్లవాత్మక దృక్పథం.....

    చలం సామాజిక కట్టుబాట్లను, హిపోక్రసీని ప్రశ్నించిన తొలి తెలుగు రచయితలలో ఒకడు. ఆయన స్త్రీవాద ఆలోచనలు ఆనాటి సమాజంలో అసాధారణమైనవి.

    2. సాహిత్య శైలి...

    చలం భాషలో సౌందర్యం, సహజత్వం, భావోద్వేగ లోతు ఉన్నాయి. ఆయన వాక్యాలు పాఠకుల మనసును కదిలించేవి.

    3. సామాజిక సంస్కరణ....

    చలం రచనలు స్త్రీ స్వేచ్ఛ, సాధికారత, సామాజిక సమానత్వం వంటి ఆలోచనలను ప్రోత్సహించాయి. ఆయన రచనలు యువతను ఆలోచింపజేసి, సామాజిక మార్పుకు దోహదపడ్డాయి

    • మహా ప్రస్థానానికి ముందుమాట...

    చలం గారు శ్రీ శ్రీ వ్రాసిన "మహాప్రస్థానం"కు ముందుమాట వ్రాసాడు. మహాప్రస్థానం లోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. "యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి (పదును) ఆలోచింపజేయగల శక్తి ఉన్నాయి. అందులో కొన్ని వాక్యాలు.....

    ఇది మహాప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాధంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకుపోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
    ......
    శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆరెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు. కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బలకింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం, గింగురుమంటాయి. కంఠం తగ్గించి వినపడకండా తగ్గుస్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలికింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింపజేస్తారు. బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.

    . . . శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు. " ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు.

    4. వ్యక్తిగత సంఘర్షణ....

    చలం జీవితం ఒంటరితనం, సామాజిక అవమానాలు, కుటుంబ సమస్యలతో నిండినది. ఈ సంఘర్షణలు ఆయన రచనల్లో ఆవేదన, తాత్వికతగా ప్రతిఫలించాయి

    చలం ప్రేమ విషయలాతో విసుగుచెంది భార్య రంగనాయకమ్మ క్షోభ పడింది. తర్వాత వదిన పెద్ద రంగనాయకమ్మ మరణించింది. అన్ని విధాలా అతడిని తెలుగు సమాజం వెలివేసింది. చలం విజయవాడలోని సొంత ఇంటిని ఫిబ్రవరి9, 1950లోనే అమ్మి అరుణాచలం లోని రమణమహర్షి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. కానీ ఆయన రచనల మీద మమకారం తీరక అనేకమంది అక్కడకు వెళ్లి ఆయనను చూసి, మాట్లాడి వచ్చేవారు. చలం కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు నచ్చిన వాళ్లతో జరిపేవాడు. చివరకు ఆధ్యాత్మిక భావనలోని సౌందర్యంలో మునిగి మే4, 1979లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
    ......
    గుడిపాటి వెంకటాచలం ఒక సాహిత్య తుఫాను. ఆయన రచనలు సమాజాన్ని ఊపేసి, స్త్రీ స్వేచ్ఛ, సామాజిక సంస్కరణల గురించి కొత్త చర్చలను రేకెత్తించాయి. ఆయన జీవితం వివాదాలు, ఒంటరితనం, ఆధ్యాత్మిక అన్వేషణల మధ్య సాగినప్పటికీ, ఆయన సాహిత్యం తెలుగు సాహిత్య లోకంలో అమరత్వం సాధించింది. చలం రచనలు ఈ రోజు కూడా పాఠకులను ఆలోచింపజేస్తాయి, సమాజంలోని హిపోక్రసీని ప్రశ్నించే శక్తిని కలిగి ఉన్నాయి. ఆయన ఒక రచయితగా మాత్రమే కాక, సామాజిక సంస్కర్తగా, తాత్వికుడిగా తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించారు.   

              
     CONCEPT( development of human relations and human resources )
  2. Face book courtesy