L.చలం musings


" స్త్రీకి కూడా శరీరం వుంది!"

చదవండి!

" ప్రజలు అధర్మాలూ, అవినీతులూ అనేవి
చాలా...వాళ్ళకి...ఏ పనులు చెయ్యడానికి 
ధైర్యం లేదో అవి ఐ వుంటాయి.వాటిని
సమర్ధించుకోటానికి శాస్త్రాలని సాక్ష్యం 
తెచ్చుకుంటారు.తమకి ఇష్టమైనవి శాస్త్రాలు నిషేధించినా చెయ్యడం మానరు!"

" వొరే! ఇట్లాంటి వాళ్ళు నీకే కనబడతారేంరా!ఇంతదేశం తిరిగే మాకు
కనబడరేం?"

అని కొంచెం అపనమ్మకం గొంతుకతో
అడిగాడు.సహృదయుడు, తేటనీటి
మనసున్నవాడు,నా మాటలో వేదవాక్యం
వంటి విశ్వాసమున్నవాడు పంతులు.ఇంక
తక్కినవాళ్ళు నమ్ముతారా!నేను నా
ఆవేశాన్ని దిగమింగుకోలేక పోయినాను.

" ఉన్నారు.నీ చుట్టూ, ప్రతిచోటా ప్రతి
రోడ్డుమీదా ఉన్నారు.ఆ దృష్టి లేదు నీకు!
పలకరు, చెప్పుకోరు, ముందుకు రారు.
గాయపడ్డా నెత్తురు మళ్ళీ కారుతుందని
భయం.వాళ్ళకా?అందం ఎప్పుడో పోయివుంటుంది.హృదయ సౌకుమార్యం 
ఈ ప్రపంచం కాళ్ళకిందపడి ఎప్పుడో
నలిగి వుంటుంది.భరించలేవు వాళ్ళని
దగ్గరగా.కాని ఆ మలినంలోంచి, ఆ దీనత్వంలోంచి, ఆ మౌనంలోంచీ-
ఎక్కిరిస్తావా, అవిశ్వాసంతో చూశావా,
గట్టిగా ప్రశ్నించావా,మాట్లాడకుండా గుంపులో కలిసిపోతారు!"

" మనిషిని చూస్తే మనిషికి లోపల్నించి
స్నేహభావం,పెట్టిన అన్నం ఆకలి తీరుస్తో
వుంటే,కుక్కకి గానీ,కుంటికి గాని,తృప్తి.తనకి ప్రతిగా కాలంలో నిలిచే
సంతతిని చూసి హృదయానికి పట్టిన గర్వం, తన ఇరుకు తప్పించి విశ్వవిశాలత్వంతో కలిసి గానం చేసే
ఆత్మసంయోగం-వీటన్నిటికీ అంధులౌతున్నారు.శాంతీ, స్థిమితమూ
లేకండా ఎగబాకడం, కూడబెట్టడం,
ఖర్చులోనే గొప్ప పడడం.ఒకటే ఆరాటం.
ఇటూ అటూ చూసి, గొప్పగొప్పpossesion. సౌఖ్యానికి,ఉత్త
possession ముఖ్యమైపోయింది.
కట్టిన ఇల్లు తనకి సౌఖ్యమివ్వడానికి కన్న ఇతర్లకి చూపి ఈర్ష్య పెట్టడానికి...."

" హృదయంలోంచి వెన్నెలని సృజించుకోలేని మానవుడు దురదృష్టవంతుడు!"

" ఈ ఊళ్ళో మనిషికి పెద్ద జబ్బుచేస్తే,
ఆ జబ్బుకి వైద్యానికన్న చచ్చింతర్వాత
కర్మలు వైభవంగా చెయ్యడానికి ఖర్చు పెడతారు.బతికివున్న పిల్లల కడుపుకొట్టి 
చచ్చిన మనుషులకు ఊరేగింపులు
జరుపుతారు.ఊరందరికీ భోజనాలు
పెడతారు.అది ప్రతిష్ఠ.ఈ మూర్ఖుల్లో
అసహ్యించుకునే గుణం దేశం మొత్తంమీద వివేకవంతుల్లో కనబడేప్పటికి, ఆగి ఆలోచించవలసి వొస్తుంది.మనిషి తన ప్రతిష్ఠ కోసం నిత్యం 
పడే యాతనకంటె ఎక్కువగా, దేశ ప్రతిష్ఠ 
కోసం రాజ్యాధిపతులు పడుతోంటే సంస్కారం, విద్యాజ్ఞానం అంటామే వాటి
విలవల మీద గట్టి సందేహం కలుగుతోంది!"

" ఎవరినన్నా క్షమిస్తుందిగాని లోకం, నిద్రలోంచి లేచి అందాలు చూడమనే
ఆర్టిస్టునీ, చావులోంచి లేచి ఆనందంలో
బతకమనే ప్రియుణ్ణీ క్షమించదు.తమ నుంచి తీసుకునే వాళ్ళమీద వున్న ఇష్టం,
తమకి ఇచ్చేసుకునే వాళ్ళమీద వుండదు.
ముఖ్యంగా వాస్తవాన్నీ, శక్తినీ, జీవితాన్ని 
పంచిపెట్టే వాళ్ళమీద అమితమైన ద్వేషం!"

" పిల్లలు -ఉత్తనెత్తురు,ఎదిగే ఎముకలు,
ఆతృతతో విశ్వాసంతో నిండిన చూపులు,
ముద్దుమాటలూ,అర్ధంలేని అల్లరీ,
నిష్కపటమైన మనసులూ-చవక,
అతి చవక-పిల్ల చస్తే పిల్లను కనడం సులభం.పురుగులమల్లే లోకమంతా పిల్లలు-ఎన్ని కోట్లు-ఏమైతేనేం-బాధ ఏమిటో,ఎందుకు కలుగుతుందో తెలుసుకోలేని పాపలు.బలపం పట్టుకొని,
తలవొంచుకుని ఐదుగంటలు....ఒక వంకర
గీత మీద అట్లా రుద్దుతూ, ఒక్క అక్షరాలేమిటి,సమస్తమున్నూ,టీచర్ల ప్రశ్నలూ,ఈ దరిద్రగొట్టు ఇనస్పెక్టర్ల తనిఖీలూ-అంత నవ్వు రాకపోతే,ఈ కోపమే దహించకపోతే-ఏడుద్దును!"

" ఎంత చదువుకున్నా,ఎన్ని పరీక్షలు గట్టెక్కినా, తాము చదివింది వంటపట్టించుకుని ఏ విషయమైనా
ఒరిజినల్ గా మాట్లాడగల స్త్రీలు చాలా తక్కువ! మాటలు విన్నా ఉపన్యాసాలు 
విన్నా ఉత్త చిలకపలుకులు.అసలు జన్మవల్ల సంస్కారం కలిగిన స్త్రీలున్నారు
గొప్పవారు,పల్లెటూళ్ళలో.కాని చదివి
గొప్పవారైన స్త్రీలు ఈ దేశంలో లేనట్లున్నారు.మళ్ళీ చదువువల్ల చక్కని 
పాలిష్ వచ్చిన పురుషులున్నారు."

" పశ్చిమ ఖండాలుట!ద్వేషాలుట!
ఆటంబాంబులట!ధ్వంసంట!వీళ్ళూ
వెక్కిరించడం!వాళ్ళేదో దారుణాస్త్రాలు
తయారుచేసుకుని,చంపుకోనన్నా 
చంపుకుంటున్నారు.ఊరికే,ఇళ్ళల్లో,గుంటల్లో పురుగుల్లాగు కులకులమని మురిగి చచ్చే, పిల్లల్ని కంటో,బైట జబ్బలు 
చరుచుకుంటో,యోధాను యోధులమంటో,జయ్ జయ్ అని వీధులంతా అర్ధం లేకుండా అరుస్తో,
కలకాలం ఏ రోగమో పడేసి పీల్చేసి
చంపిందాకా చిరకాలం బతికి వీరందరూ
చేస్తున్న మహాకార్యమేమిటి?
సంవత్సరానికి ఓ కోటి జనసంఖ్య పెరగటం తప్ప!"

" ఈనాటి ప్రజలు క్రమంగా ప్రతి అనుకూలం కోసమూ ప్రభుత్వాలమీద
ఆధారపడటమూ,ప్రభుత్వాలు ప్రజల
జీవితాల్లో కలగచేసుకుని నిర్ణయించడమూ జరుగుతోంది.ప్రజల బాహ్యక్షేమానికి చాలా ఉపకారాలు
నానాటికీ హెచ్చుగా కలుగుతున్నట్లు కనబడ్డా,లోపల లోపల కనపడకుండా
వ్యక్తిస్వాతంత్ర్యం హరించిపోతో వుంటుంది.ప్రభుత్వం మీద బాగా
ఆధారపడటం వల్ల,తప్పు అంటే ప్రభుత్వానికి కోపం తెప్పించడమే అనే
దానికింద తేలుతుంది.అసలు ధిక్కరించే
తిరుగుబాటూ,స్వతంత్రంగా యోచించే
శక్తీ, చాలా నాజూకుగా, నొప్పి లేకుండా
తెలీకుండా లాగేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఈ పద్ధతికి చాలా పెద్దపేర్లు పెడతారు-
విద్యా,సంస్కృతీ, లా, ఆర్డర్, దేశానికి
ఉపద్రవ రక్షణా ఇట్లాంటివి.
ప్రజలకి తిరగబడవలసిన అగత్యం
తక్కువౌతోంది.కాని తిరగబడ్డారా,
సర్వవిధాల నాశనమే.చంపనక్కరలేదు.
ప్రభుత్వాన్ని ధిక్కరించిననాడు బియ్యం 
దొరకవు.పంపులో నీళ్ళు రావు!"

ఈరోజు చలం జయంతి!