GUNTUR

గుంటూరు  జిల్లా 
🎶 గుంటూరు జ్ఞాపకాల నిలయం జానపద గీతం 🎶

పల్లవి
గుంటూరు జ్ఞాపకాలు వెంటాడె రా,
మనసులో గీతాల పల్లవులాయరా. 🎵

చరణం – 1 : పంటలు
గుంటూరు కారం పొగాకు బేరం,
పత్తి పంట గోంగూర వంట.
పసుపు తోటలు బ్రతుకు బాటలు,
రైతు జీవితం పల్లె బాటలు. 🎶

చరణం – 2 : చుట్టూ గ్రామాలు
పెద కాకాని  ఉప్పల పాడు,
నారా కోడూరు ఏటుకూరు.
అంకిరెడ్డి పాలెం నల్లపాడు,
పలకలూరు . 🎵

చరణం – 3 : పేటలు
గుజ్జనగుండ్ల స్తంభాల గరువు,
నగరంపాలెం నాజ్ సెంటర్
శంకరవిలాస్ లాడ్జి సెంటర్
కొరిటేపాడు బృందావన గార్డెన్స్

చరణం – 4 : కాలేజీలు
హిందూ కాలేజీ విద్యా నిలయం,
వేలాది విద్యార్థుల కలల గగనం.
AC కాలేజీ గౌరవ కాంతి,
గుంటూరు విద్యకు వెలుగైన గీతం. 🎵

చరణం – 5 : హోటల్స్ & సెంటర్స్
శంకరవిలాస్ కాఫీ పరిమళం,
గీత కేఫ్ ఆనంద భవన్ భోజనం.
లాడ్జి సెంటర్ కోలాహలం,
కోరిటపాడు ఊరి జ్ఞాపకాల కలయిక. 🎶

చరణం – 6 : రింగ్ రోడ్డు & ప్రాంగణాలు
రింగ్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్,
మెడికల్ కాలేజీ వెలుగులు.
పెరేడ్ గ్రౌండ్, గుంటగ్రౌండ్,
స్టేడియముల జ్ఞాపక గీతాలు. 🎵

చరణం – 7 : స్టేడియములు & విద్యాసంస్థలు
బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్ స్టేడియం,
పోలిటెక్నిక్ హిందూ కాలేజీ.
AC కాలేజీ మధుర జ్ఞాపకం,
గుంటూరు గాథలు గుండెలో నిలిచె. 🎶

ముగింపు
గుంటూరు నేల మధుర జ్ఞాపకం,
జానపద గీతం మన ప్రాణధనం. 🎵

👉 ఇది ఒక పల్లె – పేట – విద్య – వినోదం – జ్ఞాపకాలు అన్నీ కలగలిపిన సంపూర్ణ గీతం.
 గుంటూరును వూరనుకున్నారేమో.... అది వట్టి వూరు కాదు..
మాచర్లలో సహారాఎడారి
తెనాలిలో కేరళా తేమ
పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత్ శ్రేణులు
బాపట్లలో మయామీ బీచ్
మంగళగిరిలో సుమత్రా అగ్నిపర్వతం, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, 
సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్ ... 
ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ,  మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళం. 

 పులిహార, బిస్కెట్టు, మావూలుగా వుండదూ, కెవ్వు కేక లాంటి ప్రయోగాలను  సృష్టించి మీ సినిమాలకూ, స్కిట్లకూ, సాహిత్యానికీ, సంగీతానికీ నుడికారాలూ, జాతీయాలూ, పడికట్టు పదాలూ, పంచులూ అందించి కలం పట్టుకున్న ప్రతీ వాడి నోటికీ నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణరా ... 
***
డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లలో బాతాఖానీ వెయ్యడమే తెలుసు అనుకుంటున్నారా... చరిత్ర తెలియని అమాయకులనుకుంటున్నారా లేక అసలు చరిత్రే లేని అభాగ్యులం అనుకుంటున్నారా...
***
క్రీస్తుకు అయిదు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిపాలపుత్ర రాజ్యం మా సొంతం. దాన్నే ఇవాళ్ళ బట్టిప్రోలు అంటున్నారు. కుభేరుడు మా రాజు. శాతవాహనులూ, ఇక్వాకులూ, పల్లవులూ, ఆనందగోత్రికులూ, విష్ణుకుండినులూ, కోట వంశీయులూ, వేంగీచాళుక్యులూ లాంటి అనేక రాజపరంపరలకు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది.. 
నాటుగా ఉంటారూ, మోటుగా మాట్లాడతారూ ఆధునికత తెలియని అనాగరికుల వూరు ఇది అనుకుంటున్నారా... 

వెయ్యి కిలమీటర్ల కోస్తా తీరం ఉన్న తెలుగు నేల అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మొదట దిగి స్కూళ్లు కాలేజీలు కట్టించడానికి అనువైన ప్రదేశం అని ఎంచుకున్న జిల్లారా ఇది.   
మీరు దేశాలు దాటవచ్చు. కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లే. 
దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. 
మీరు ఇవాళ్ళ వెలగబెడుతున్న కార్పోరేట్ విద్యకు బొడ్డుకోసి పేర్లు పెట్టింది గుంటూరే. అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్ళే కారాలూ, పచ్చళ్ళూ, పొడులూ ఎయిర్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చెయ్యడం నేర్పింది గుంటూరే. 
పాకిస్థాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు.  
జగజ్జేత చంఘీజ్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం క్రింద ఒక పేటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు. 
అసలు గుంటూరు ఒక వూరు కాదురా... అదొక వడ్డించిన విస్తరిరా..... 
గోదావరిఖని నుండీ సూళ్ళురుపేట వరకూ విస్తరించిన తెలుగు నేలనుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్ధుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీరా గుంటూరు. 
ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయనైన అంగలకుదురు సపోటాలూ తినిపిస్తుంది ఈ గుంటూరు. వూరి నడిబొడ్డున మిర్చీయార్డ్, వూరి గుండెలనిండా మాల్పూరీకోవా దట్టించుకున్న వైభోగమేరా ఈ గుంటూరు

అసలేం తెలుసు మీకు... 
గుంటూరు ఒక చెట్టురా.... నిలబడిన చోట కదలకుండా వుంటూనే రెండు రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని వూడలు వేసిన మహావృక్షమ్రా అది. రెండు రాష్ట్రాలూ విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో ' గుంటూర్ గో బ్యాక్ - గోంగూర గో బ్యాక్ ' అనే కీర్తిని విని ముసుముసిగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడి వంటి మెచ్యూర్ విలన్ గుంటూరు. 

గుంటలో వుంటుంది, బురదలో ఈదుతుంది అనుకుంటున్నారేమో... నల్లరేగడి భూముల్లో మొదటి సారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేల ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పుగాకూ పత్తీ పండించి బ్రిటన్ మార్కెట్టును గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములు ఇవి. 
అంతెందుకు.. ఎందుకూ పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువను అద్ది ఎందరో జేబుల్ని నింపి మరెందరో కడుపుల్ని నింపింది గుంటూరు మనుషులే. అసలు రెండు రాష్ట్రాలలో ఇవాళ్ళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాదులు వేసింది గుంటూరని మర్చిపోతే ఎలా? 

గుంటూరు పొద్దున్నే నాలుగున్నరకు నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు. గుంటూరు రాత్రి రెండుగంటలకు కూడా ఇడ్లీలు వడ్డించే సిటీ రైల్వేస్టేషన్. గుంటూరు కళ్ళాపి వాసనల కుగ్రామం, హైటెక్ ఆసుపత్రుల మెట్రోపొలిస్. వానొచ్చినా వరదొచ్చినా, కరువొచ్చినా గత్తరవచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోడానికి ఎన్ని అడ్డంకులనైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం. ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దాంపత్యం. మీరు పైకి గేళి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కుళ్ళుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్ల గుంటూరు. 

దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే  ఖాశిం భాయ్ పలావు లేనిదే కాశీనాథ్ ఇంట్లో పెళ్ళి జరగని సమాజం గుంటూరు. 
కాలే మస్తాన్ దర్గా వురుసులో కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా గుంటూరు ఆటో స్టాండులో నీకూ నీ కుటుంబానికీ ఉపాధి ఎప్పటికీ గ్యారెంటీనే. గుంటూరు ఒక కటింగ్ చాయ్ ప్రేమ, గుంటూరు ఒక సినిమా పిచ్చి , గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్, గుంటూరు ఒక మిర్చీబజ్జీల ఉన్మాదం, గుంటూరు అసలు సిసలు జీవితం.

ప్రేమించు... గుంటూరు తల్లిలా నిన్ను పొదువుకుంటుంది. ద్వేషించకు... అమ్మోరుతల్లిలా నిన్ను బలికోరుతుంది.  

ఇది లాంగ్ అండ్ పర్వర్ట్ డైలాగ్ కాదు.... గుంటూరుకు జస్ట్ లవింగ్ అండ్  పర్ఫెక్ట్ ప్రొలోగ్ మాత్రమే. 

ఎనీ  క్వశ్చన్స్ ?