మహర్షి పతంజలి సాధారణంగా క్రీ.శ. 2వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు జీవించారు అని భావించబడుతుంది, కానీ ఖచ్చిత తేదీలు వివాదాస్పదంగా ఉన్నాయి.
పతంజలి యొక్క ప్రసిద్ధ యోగ సూత్రాలు సుమారు క్రీ.శ. 200 నుండి 400 మధ్య రచించబడ్డాయని భావిస్తున్నారు.
ఆయుర్వేదంపై పతంజలి ప్రత్యక్షంగా కాకపోయినా, ఆయన యోగ తత్వం భారతీయ వైద్యసంస్కృతిలో ఒక ముఖ్య భాగంగా నిలిచింది.
పతంజలి యోగ సూత్రములు(అష్టాంగ యోగము)
- యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.
- నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.
- ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)
- ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.
- ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
- ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.
- ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.
- సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.