భావన – ప్రగతి

భావన – వస్తు భావ పరంపర భావన
ఈ భావన ప్రగతికి మూలం.
అజ్ఞానమే శత్రువు.
జ్ఞానమనే చిరు జ్యోతిని వెలిగించి
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలుదాం.

Thought & Progress

CONCEPT - Thought leads to ideas.
Ideas form a chain of understanding.
This awareness is the root of progress.
Ignorance is the enemy.
Light the lamp of knowledge
And remove the darkness of ignorance.

సమాజం – తాత్వికులు

సమాజం వసుదైకకుటుంబం నమూన.
తాత్వికులు సమాజంతో మమేకమై
వారి కాలచక్రపరిధిని దాటి ఆలోచించారు.
సమాజానికి నూతన మార్గాన్ని నిర్దేశించారు.

— Chinta Ramamohan

Showing posts with label రాధికా సాంత్వనం : ముద్దుపళని. Show all posts
Showing posts with label రాధికా సాంత్వనం : ముద్దుపళని. Show all posts

రాధికా సాంత్వనం : ముద్దుపళని

పడగ్గది కవిత్వమా? మదిని మత్తెక్కించే పరిమళమా?

రాధికా సాంత్వనం : ముద్దుపళని[మార్చు]

కావ్య గాథ

సరసం అంటే క్రిష్ణుడు, క్రిష్ణుడు అంటే సరసాలు గుర్తుకొస్తే అది మన తప్పో క్రిష్ణుడి తప్పో కానే కాదు. వీనులకు విందుగా, కంటికి ఇంపుగా, మనసుకు హాయిగా, చెప్తున్న కొద్దీ మరీమరీ చెప్పాలని అనిపించేలా చేసిన క్రిష్ణుడి రచయితలదే ఆ పాపపుణ్యమంతా. రాధ, సత్యభామ, జాంబవతి మొదలుగాగల క్రిష్ణుడి సతుల జాబితాకు ముందో వెనకో గోపికలను చేరిస్తే, చేంతాడు చిన్నపిల్లల మొలతాడు అయిపోతుంది. వీళ్లందరిలోనూ క్రిష్ణ సాహిత్యంలో రాధ పాత్ర ప్రత్యేకమైనది. ఆమె వయసుకూడా అతడి కంటే ఐదో ఆరో ఏళ్లు పెద్ద కాదు. ఆమె ప్రౌఢ కాగా అతడు బాలుడు. మరి మాధవుడు తన పెదవుల్ని రాధ పెదవులకు ఆనించిందెప్పుడు? గోపాలుడితో మనకెవ్వరికీ అంతగా పరిచయం లేదు గాని, మన సరస సార్వభౌముడు శ్రీనాధుడు భీమఖండంలో ఈ మొదటి ముద్దు సీన్ క్రియేట్ చేసాడని ఆరుద్ర అంటారు. అంతవరకు అచుంబితంగా వున్న రాధామాధవుల సంబంధం ముద్దులను దాటించి మురిపాల వరకు చేర్చారు తరువాతి కవులు. ఈ ముద్దు మురిపాలను మరికాస్త ఘాటెక్కించి ఇద్దర్నీ మంచమెక్కించి పఠితలను మత్తెక్కించింది మాత్రం ముద్దుపళని. ఇలా క్రిష్ణుల భార్యాభర్తల ప్రణయం మధ్యలో రాధిక చేరిందా? లేదంటే రాధాక్రిష్ణ ప్రేయసీప్రియుల సరససల్లాపాల నడుమ ఇలా చేరిందా? పానకంలో పుడక ఎవరు?


టూకీగా ఈ శృంగార కావ్యాన్ని ఏక వాక్యంలో చెప్పాలంటే ఆరుద్ర మాటల్లోనే చెప్పాలి: ” ఓ సారి రాధ అలిగింది. ఆ అలుక పెరగడం, మనసు విరగడం, అవమానం కలగడం, అంతరంగం మరగడం, కృష్ణుడు రాగానే చెడామడా చెరగడం, చివరికి అతని కౌగిలిలో కరగడం ” ఇదే రాధికా సాంత్వనం కావ్య గాధ.


ప్రభుత్వ నిషేధం

మరి ఇదిలాగే ఉంటే కందుకూరి వీరేశలింగం నుండి బ్రిటిష్ ప్రభుత్వం వరకు అందరూ దీన్ని ‘చీ..బూతు ‘ అని ఎందుకు ఈసడించుకున్నట్టో? ప్రభుత్వమైతే ఏకంగా ఈ గ్రంథాన్ని నిషేధించింది కూడా. (మనకు స్వతంత్రం వచ్చేక నిషేధాన్ని తొలగించు కున్నామనుకోండి, అది వేరే కథ)


నాలుగు ఆశ్వాసాలలో నడిచిన ఈ కథనంలో ప్రతి పద్యమూ ఒక ఆణిముత్యమే. తంజావూరు రాజు కొలువులో ఉండిన ముద్దుపళని సంస్కృతం, తెలుగు, తమిళ సాహిత్యాలలో అద్భుతమైన పరిచయం ఉండడంతో భాష-భావాలపై బిగువైన పట్టుతో కథ నడిపించడం విశేషం.

బాల్యవివాహాలు ముద్దుపళని కాలానికి సహజమైన విషయం. పాపం అదే తీరులో గోపాలుడికీ ఇళా ఈడేరక మునుపే భార్య కావడంతో మేనత్త వరసైన రాధ ఇంటిలో ఇళాతో మకాం పెడతాడు క్రిష్ణుడు. ఇళ సంసారానికి సిద్ధమయ్యేలోగా అందులోని మళకువలన్నీ క్రిష్ణుడికి కంఠతా వచ్చేస్తాయి. రాధ వాటిని నేర్పిందో, క్రిష్ణుడే వాటిని నేర్చుకున్నాడో ముద్దుపళని మనకెక్కడా చెప్పరుగాని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ. కామం. ఇళాను రాధే పెంచుతుంది. వయసొచ్చిన ఇళాతో క్రిష్ణుడికి శోభనం ఏర్పాట్లు చేయాలి. చేయడమే కాదు ఇద్దరికీ విడివిడిగా ఎన్నో జాగ్రత్తలు, మెలకువలు చెప్తుంది. ఇళా క్రిష్ణులను ఒకటి చేస్తుంది గాని, రాధ మనసు మనసులో లేదు. ఇంకా తెల్లవారకముందే వారి గదిని చేరుకుని ఇళాను పక్కకు పంపించి కృష్ణుడి చెంత వాలిపోతుంది. తనతో కూడా కూడాక తొలిరాత్రి ముచ్చట్లు అడుగుతుంది. కృష్ణుడు అత్యంత సరసుడు కదా- గడుసుగా లేలేత మొగ్గ, చిన్న పిల్ల ఇళా దగ్గర అంత సుఖమేం ఉంటుందని, రాధకూ ఇళాకు పోలికే లేదని రాదను మెప్పించబోతాడు. విననట్టే నటించిన చిన్నారి, గడసు ఇళా అన్నీ వినేసిందని ముద్దుపళని ఒక్క వాక్యంలో రెండో ఆశ్వాసపు తొలి పద్యంలో చెప్తారు. అదికూడా ఇలా-

”అటు లా రాధిక, గోపీ
విటు నటు రతికేళి నేలి విడువంగ, నిలా
కుటిలాలక జేరి తనదు
కుటిలత్వ మెఱుంగనీక కూరిమి చెలగన్ “

ఆనక ఇళా పుట్టింటికి క్రిష్ణుడు వెళ్లాల్సివస్తుంది. తన దరిని గోపాలుడు లేకపోవడం రాధది వెలుతురు లేని ప్రపంచం. విరహ వేదన భరించలేక తప్పనిసరి మానసికావస్థలో చిలకను రాయబారంగా పంపుతుంది. అలా వెళ్లిన చిలక మూడు రాత్రులు ముగిసేనాటికి గడసరి ఇళా తన కొంగున క్రిష్ణుని కట్టేసుకోవడం చూసి అదే రాధకు విన్నవిస్తుంది. అక్కడితో రెండో ఆశ్వాసం ముగుస్తుంది. ఈ రెండో అధ్యాయంలోనే శృంగారం పాలు శృతిమించిందని విమర్శకులు గగ్గోలు పెడతారు. రసవత్తరమైన మూడో ఆశ్వాసంలో టైటిలుకు న్యాయం చేసే అసలు సిసలు కథ జరుగుతుంది. చిలుక చెప్పిన సంగతులు విని రాధ అసూయతో భగ్గున రగిలిపోతుంది. ఇళా క్రిష్ణుల సఖ్యత విని కలవరపడుతుంది. అన్నింటిని మించి గడసు ఇళా రాధికను పరిత్యజించమని మాధవుని బతిమాలడం చిలక చేరవేస్తుంది. అంతే రాధకు మండుతుంది. అలకపానుపు ఎక్కుతుంది. నాలుగో ఆశ్వాసంలో రేపల్లె చేరిన గోపాలుడు రాధికను ఇదీ అదీ అని చెప్పలేని విధంగా బతిమాలుకుంటాడు. రగిలిపోతున్న రాధ మాధవుని తూలనాడుతుంది. అవేవీ పట్టించుకోని గోపాలుడు తనదైన శైలిలో కాళ్ల బేరానికి వస్టాడు. అనుకోకుండా ఒక్కసారి హటాత్తుగా క్రిష్ణుడు రాధ కాళ్ల మీద పడిపోతాడు. కావ్యం చదువుతున్న మనం ఒక్కమారు కలవరపడతాం. భార్యల కోపం పోగొట్టే కొత్త టెక్నిక్ కదా అని సంబరపడతాం, కాని తన ప్రియాతి ప్రియమైన ప్రియుణ్ణి రాధ ఎడమ కాలితో తోసేసరికి ఖంగుతింటాం. కాని ఇంతలోనే తేరుకుని ప్రసన్నమవుతుంది. రాధామాధవులు ఒకటవుతారు. ఏకమైన ప్రియ జంట ఆనందంగా ఉంటారు. ఇదీ వివరంగా కథ.


ఎటు తాళనున్నదో యీ కొమ్మ కెమ్మావి
కై టభారాతి ప ల్గాటునకును?
ఎటు లోర్వ నున్నవో యీ కన్నె చన్నులు
గోపసిమ్హుని గోటి కుమ్ములకును?
ఎటు లాన నున్నవో యీ తన్వి లే.దొడల్
చాణూరహరు మారు సాదనలకు?
ఎటు లాగ నున్నదో యీ నాతి నును మేను
దంతిమర్దను కౌగిలింతలకును

(మొదటి ఆశ్వాసం 65వ పద్యం)

అంటూ బెంగపడిన రాధ ఇళాదేవికి ఎన్నో కామ శాస్త్ర రహస్యాలు చెప్పినపుడు కాస్త పచ్చిగా ముద్దుపళని యీ మాటలు వాడారని మనమూ ఒప్పుకోక తప్పదు. అలాంటి మరి నాలుగు పద్యాలు .

ఇళా గోపాలురను శోభనం గదిలోకి పంపించి తాను వగచివగచి తలచిన పద్యమిది (1లో 75)


“నాతి యింతకు మున్నె, నా సామి మధు రాధ
రామృతమ్మును జూఱలాడ కున్నె?
యతివ యింతకు మున్నె, హరి విప్పు టురముపై
గుబ్బల కసిదీఱ గ్రుమ్మ కున్నె?
రమణి యింతకు మున్నె, రమణు కౌగిట జేరి
పారావత ధ్వనుల్ పలుక కున్నె?
చాన యితకు మున్నె, శౌరి పై కొన వెను
దియ్యక యెదురొత్తు లియ్య కున్నె? “


పుట్టింటిలో క్రిష్ణుఇ భోగం గురించి చిలుక రాధకు వర్ణించి చెప్పే ఘట్టం ఇది: (2 లో 139, 140)

కృష్ణదేవుడు కరి కర క్రీడ సలుప,
జేరి తొడ లేచి పురికొల్పె గీరవాని,
నీలవర్ణిడి పైకొని కేళి నేల,
బాళి నెదురొత్తు లిచ్చె నిళా లతాంగి. (139)
కిలకిల నవ్వులు, గిలిగింతలును, బంధ
భేదపు రవములు, వింత వగలు,
పావురా పలుకులు, వాతెర నొక్కులు,
చిగురు మకారముల్, మరుగు తిట్లు,
దురుసు పైసరములు, తొందర ముద్దులు,
బిగి కౌగిలింతలు, బింకములును,
గొనగోటి మీటులు, గోర్గింపు, లుబుకులు,
కొసరులు, బొమ ముళ్ళు, కురుచ సన్న, (140)
రాధ అలకను తీర్చిన మాధవుడు ఆమెతో కూడినపుడు (4లో 103)
హత్తుకొని, యిన్ని విధముల
దత్తఱపడ ననగి పెనగి, తనివారక యా
బిత్తరి పై కొనె హరిపై,
మత్తేభముమీద నెక్కు మావంతు డనన్.

కవయిత్రి ముద్దుపళని[మార్చు]

కవయిత్రి ముద్దుపళని గురించి రెండు మాటలు : 1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసిం హుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో “రాధికా సాంత్వనం ” రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండిత పామరులు క్షమార్హులు కారు. మన అదృష్టం కొద్దీ బెంగుళూరుకు చెందిన నాగరత్నం గారు తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారట. తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనం ను ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది. మరో మాట - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. అదో పెద్ద విచిత్రం. మీకు ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా (క్రీ.పూ. 600-ఇప్పటివరకు)గ్రంథంలో చదవండి. ఇలాంటి కవిత్వాన్ని బూతు బూతని కారుకూతలు కూసేవారికి ఒక్కటే చెప్పగలం. నరాలని మెలిపెట్టించి, కోరికతో బుసలు కొట్టించి, మనసును పెడదోవ పెట్టించే సాహిత్యం మాత్రం ఖచ్చితంగా బూతు సాహిత్యం (ఎరోటిక్ లిటరేచర్). కాని హృదయానికి ఆహ్లాదం కలిగించి, ఊహలకు ఉత్తేజం అందించి, మనసుకు కొత్త రెక్కలిచ్చే మాటైనా, పాటైనా, బొమ్మైనా అది మంచి సాహిత్యమే అవుతుంది. ఆ లెక్కన చూస్తే ముద్దుపళని కవిత్వం ముచ్చటైన కవిత్వం.

ఆరుద్ర చెప్పిన ఒక్క మాట - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే తిరుపతి వేంకట కవులు, మల్లాది రమక్రిష్ణ శాస్త్రి తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.

Collection
CONCEPT ( development of human relations and human resources )