Friday, January 29

03.కులం - భావన

కుల సమస్య- భారత ప్రజాస్వామిక విప్లవం
(పీపుల్స్ వార్ గ్రూప్ సంస్థాపకులు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య రచన,  ‘వ్యవసాయ విప్లవం’ పుస్తకం నుండి, "కుల సమస్య- భారత ప్రజాస్వామిక విప్లవం" అనే వ్యాసం)

భారత ప్రజాతంత్ర విప్లవంలో కులాల సమస్య ఒక ప్రత్యేక సమస్య. ఐరోపాలో జరిగిన ప్రజాతంత్ర విప్లవంలో (19వ శతాబ్దంలో) ఈ సమస్య ఏ రూపంలోనూ తలెత్తలేదు.  కానీ మన దేశంలో ఉన్న ప్రజానీకమంతా  ఈనాడు వివిధ వర్గాల క్రింద ఎలా విభజింపబడ్డారో, అలాగే వివిధ కులాల క్రింద కూడా వారు విభజింపబడి ఉన్నారు. ఇది కాదనలేని యదార్థం. అందువల్ల మనం కళ్ళు మూసుకొని ముందుకు పోతున్నా ఏదో ఒక రూపంలో కులాల సమస్యలు ఎదురవుతూ వస్తాయి.   అందువల్ల ఆ  సమస్యల యెడల జనరల్ గానూ, నిర్దిష్టంగానూ కూడా విప్లవకారులకు స్పష్టమైన వైఖరి ఉండాల్సిందే. మనం ఈ కుల సమస్యకు సంబంధించిన ఈ కింది అంశాలను పరిశీలించడం అవసరం:
1) మన దేశంలో కుల సమస్య స్వభావము, అందుకు పరిష్కారము.
2) వర్గపోరాటం పైనా, సామాజిక అభివృద్ధి క్రమం పైనా, ఆ సమస్య యొక్క అనుకూల, వ్యతిరేక ఫలితాలు ఏమిటి?
3) వెనకబడ్డ, షెడ్యూల్డ్ (నిమ్న) కులాలపై సాగుతున్న సాంఘిక దురంతాలను, జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి ఉపేక్షించడం ఎంతవరకు సబబు?
4) యాదృచ్చికంగా ఎదురయ్యే కుల సమస్యల యెడల మనం ఎలాంటి వైఖరి తీసుకోవాలి?
5) ఈ సమస్యపై రివిజనిస్టు వైఖరి, విప్లవకారుల (మార్క్సిస్టు-లెనినిస్టు) వైఖరుల మధ్య గల తేడా ఏమిటి?
6) ఈ సమస్యకు సంబంధించి రివిజనిస్టు పీరియడ్ లోని ఆచరణ యొక్క పర్యావరణం ఏమిటి? 
ఒక్కొక్క విషయాన్నే తీసుకుందాం.
మన దేశంలో కుల వ్యవస్థ చాలా పురాతనమైనది. అది చాలా పవిత్రమైనదిగానూ భారతీయ సంస్కృతి యొక్క విశిష్టత గానూ బోధిస్తూ, దాన్ని చెక్కుచెదరకుండా కాపాడాలని కంకణం కట్టుకున్న వారు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. కుల వ్యవస్థ గూర్చి ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా అది మార్పుకు అతీతమైనది కాదు, ఆది మధ్యాంత రహితమయిందీ కాదు. ప్రకృతిలోని అన్ని విషయాలలో లాగానే కుల వ్యవస్థకు కూడా పుట్టుక, అభివృద్ధి, అంతము ఉండి తీరాలి. సామాజిక అభివృద్ధి క్రమంలోని కొన్ని చారిత్రిక, భౌగోళిక కారణాల వల్ల ఐరోపాల కంటే పటుతరమైన పునాదులతో మన దేశంలో గ్రామీణ వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధి క్రమంలో జీవితావసరాలు ఉత్పత్తి కొరకు ప్రజల మధ్య జరిగిన శ్రమ విభజన వంశపారంపర్యంగా కొనసాగి, క్రమంగా ఒక్కొక్క వృత్తికి చెందిన వారు ఒక్కొక్క కులంగా రూపొందారు. ఆ పిమ్మట శాఖోపశాఖలు గానూ, క్లిష్టతరమైనదిగానూ ఆ కుల వ్యవస్థ రూపొందడానికి ఎన్ని తదితర భౌతిక కారణాలు ఉన్నా, అసలది ఆవిర్భవించడానికి భారతీయ గ్రామీణ వ్యవస్థ యొక్క ఉత్పత్తి క్రమంలో ప్రజల మధ్య ఏర్పడిన శ్రమ విభజనే మూలం. ఫ్యూడలిజం మనదేశంలో చాలా దీర్ఘకాలం కొనసాగి సామాజిక అభివృద్ధి స్తంభించిపోగా, అలా రూపొందిన కులవ్యవస్థ పోను పోను అనేక వెర్రితలలు వేసి క్లిష్టతరమైందిగా  తయారయింది. ఫ్యూడల్ ఆర్థిక విధానం సమూలంగా నశించి, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అభివృద్ధి చెందే క్రమంలో, మానవుల మధ్య శ్రమ విభజనలో కొత్త పద్ధతి ఆరంభమవుతుంది. యంత్ర అభివృద్ధికీ యంత్ర నిర్వహణకూ అనుకూలంగా ఆ విభజన ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన ఒకరు డ్రైవర్ కాగా, అదే కుటుంబానికి చెందిన మరొకరు అదే ఫ్యాక్టరీలో పద్దులు రాసే గుమస్తాగా ఉండొచ్చు. అంటే కుటుంబమంతా ఒకే వృత్తికి పరిమితం కావటం అంతరిస్తుంది. అది ఎప్పుడు అంతరిస్తుందో,  అప్పుడే ఒకే వృత్తి చేసే వారంతా ఒకే కులం అనే వ్యవస్థకు ఆధారంగా ఉన్న భౌతిక పునాది కూడా దెబ్బ తిని పోతుంది. అంతేకాదు, యంత్రాలతో ఉత్పత్తి ఆరంభమైన తర్వాత, ఫ్యూడల్ ఆర్థిక విధానంలో లాగా ఒక పని సంపూర్ణంగా ఒకరే చేయగల పరిస్థితి కూడా అంతరిస్తుంది. ఉదాహరణకు, ఫ్యూడల్ సమాజం లో బట్టలు ఉత్పత్తి చేసే చేనేత కార్మికునికి పడుగు పన్నడం దగ్గర నుండి బట్టలు నేయడం పూర్తయ్యే వరకు చేయవలసిన పని విధానమంతా ఆమూలాగ్రంగా తెలుసు.  అలాగే, ఒక ఇనుప పనిముట్టును చేయవలసిన ఆనాటి కమ్మరికి, ఇనుము కరిగించడం నుండి ఆ పనిముట్టు  పూర్తి చేసే వరకు అవసరమైన సంపూర్ణ జ్ఞానం ఉంది. కానీ యంత్రాలతో ఉత్పత్తి ఆరంభమైన తర్వాత, యంత్ర చలనానికి అనుగుణంగా ప్రతి ఒక్క పని భిన్న భిన్న భాగాలుగా విభజింపబడి, అందులో పనిచేసే వారు ఒక్కొక్కరికి ఆ ప్రత్యేక విభాగానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ఉండి, మొత్తం ఆ వస్తువు తయారవడానికి అవసరమైన సంపూర్ణ జ్ఞానం ఏ ఒక్కరికి లభ్యం కాని స్థితి ఏర్పడుతుంది. వెల్డర్ చేయవలసిన పని ఫిట్టర్ కు  తెలియదు. ఫిట్టర్ చేయవలసిన పని మరొకరికి తెలియదు. వారందరి శ్రమ కలిస్తే గాని విలువలు సంతరించుకునే ఏ సరుకూ తయారు కాదు. ఆ విధంగా ఫ్యూడల్ ఆర్థిక విధానం స్థానే   పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అమల్లోకి వచ్చే క్రమానికి అనుగుణంగా శ్రమ విభజన బహుముఖంగా విస్తరించింది.   ఒకే కులం వారందరికీ ఒకే పని విభజన అనే సంగతి అలా ఉంచి, ఒకే కుటుంబం వారందరికీ ఒకే రకమైన శ్రమ విభజన అనేదానికి కూడా ఆస్కారం లేకుండా పోయి, కుల వ్యవస్థ ఆవిర్భవించడానికి గల భౌతిక పునాది శిధిలమై పోతుంది. పెట్టుబడిదారి విధానం అభివృద్ధి చెందిన తర్వాత కూడా కులవ్యవస్థ అవశేషాలు మిగిలి ఉండొచ్చు. అయితే పెట్టుబడిదారులు తమ స్వప్రయోజనాలు సాధించుకోవడానికి అవి ఉపకరిస్తాయి.  కానీ కుల వ్యవస్థ యొక్క అస్తిత్వానికి గల పునాది రద్దు కావడంతో, పెట్టుబడిదారీ విధానం అమలులో ఉన్న దశలోనే అది దుర్బలమై, చివరకు సోషలిస్టు సమాజంలో వర్గాలు సమూలంగా రద్దయి, ఉత్పత్తి మరింత కేంద్రీకృతమై మానవుల మధ్య శ్రమ విభజన మరింత ఉన్నత స్థాయి అందుకోగా, దాని అవశేషాలు సైతం సమూలంగా అంతరించడం అనివార్యం. ఇది కుల వ్యవస్థ యొక్క ఆద్యంతాల పరిణామ క్రమం. దీన్ని అనుసరించి పీడిత ప్రజలందరిలోనూ కుల చైతన్యం స్థానే వర్గ చైతన్యాన్ని పెంపొందింప జేసి, వర్గ పునాదులపై వారిని సంఘటితపరిచి, కార్మికవర్గ నాయకత్వం క్రింద జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని విజయవంతం చేయడంలో భాగంగానే కుల సమస్య పరిష్కారమవుతుందని బోధపడుతుంది. కుల వ్యవస్థకూ దాని పరిష్కారానికీ సంబంధించి మనకున్న జనరల్ అవగాహన ఇది.
ఇక రెండో విషయానికి - అంటే వర్గపోరాటం పైనా, సామాజిక అభివృద్ధి క్రమం పైనా ప్రభావం ఏమిటి? అనేదానికి వద్దాం.
ఒకప్పుడు ఈ వ్యవస్థ, సామాజిక ఉత్పత్తి క్రమంలో ఒడిదుడుకులు లేకుండా కొనసాగడానికీ, అభివృద్ధి చెందడానికీ తోడ్పడి ఉండవచ్చు, తోడ్పడింది కూడా. లేకుంటే ఆ వ్యవస్థ ఆవిర్భవించడానికి ఆస్కారం లేదు. కానీ ఈ నాడు అది ఆ పాత్రను కోల్పోయింది.  మానవ సమాజం యావత్తూ ఈ రోజు సరుకుల ఉత్పత్తి విధానం లోనే, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలోనే, జీవిస్తోంది. మన దేశంలో ఇప్పటికీ ఫ్యూడలిజం బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, పెట్టుబడిదారీ విధానం ఇంకా తగినంతగా బలపడక ఈనాటికీ మనది వ్యవసాయక దేశం గానే ఉన్నప్పటికీ, అర్ధ వలస దేశంగా మనం సరుకుల ఉత్పత్తి విధానం లోనే మునిగితేలుతున్నాం. అందుమూలంగా ఉత్పత్తిని పెంపొందించడానికి సాధనంగా ఉపకరించగల పాత్రను కులవ్యవస్థ ఈనాడు కోల్పోతోందని చెప్పవచ్చు.   కులవృత్తులు ఈనాటికీ మిగిలి ఉన్నా, అవి పెట్టుబడిదారీ మార్కెట్ పోటీ ధాటికి నిలువలేక నీరసించి పోతూనో, జీవచ్ఛవాలుగా మనగలుగుతూనో, మిగిలి ఉన్నాయి. కుల వ్యవస్థ ఈనాడు సామాజిక అభివృద్ధికి ఆటంకంగానే తయారైంది. వర్గ పోరాటంలో పీడిత ప్రజలందరినీ సంఘటిత పరచడానికి ఆది కొంతవరకు అవరోధంగా తయారయింది అనడం అతిశయోక్తి కాదు. అలాగే కుల దురహంకారం రెచ్చగొట్టడం ద్వారా పీడిత ప్రజలలో విభేదాలు పెంచి చీల్చడానికి దోపిడీ వర్గాల చేతిలో ఈనాడది ఒక బలమైన సాధనంగా కూడా ఉపకరిస్తోంది.
జాతీయోద్యమం పురోగమిస్తున్నప్పుడల్లా మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు హిందూ ముస్లిం గలాటాలను రేపి జాతీయ సమైక్యతను ఎలా దెబ్బ కొట్ట ప్రయత్నించారో, అలాగే ఈనాడు వర్గ పోరాటాలు తీవ్రతరం అయినప్పుడల్లా పీడిత ప్రజల సమైక్య ప్రతిఘటన శక్తిని దెబ్బ కొట్టడానికి గాను ఒకవైపు కుల దురహంకారాలను రెచ్చగొట్టడం ద్వారానూ, మరోవైపు వెనకబడ్డ కులాల సంక్షేమం లాంటి దగుల్బాజీ కార్యక్రమాలతో భ్రమలు రేకెత్తించి పోరాటం పట్ల వారిలో ఉదాసీనత పెంపొందించడం ద్వారానూ, పాలకవర్గాలు పడరాని పాట్లు పాడడం మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల జనరల్ గా కుల వ్యవస్థ ఈనాడు అభివృద్ధి నిరోధక పాత్రే వహిస్తోంది. అభివృద్ధికర పాత్రను శాశ్వతంగా అది కోల్పోయింది. 
ఇక మూడవ అంశానికి వద్దాం. ఈ సందర్భంగా, వెనకబడ్డ, షెడ్యూలు కులాలపై కొనసాగుతున్న సాంఘిక దురంతాలను జనరల్ గా కుల వ్యవస్థతో ముడిపెట్టి, ప్రజాతంత్ర సమాజ స్థాపనతో పాటు వాటంతట అవిగానే  ఆ దురంతాలు నశిస్తాయని ఉపేక్షించడం సరి అయినదా, కాదా అనేది ప్రస్తుతాంశం.  అలా ఉపేక్షించరాదనీ, ఆ దురంతాలను ప్రతిఘటించడానికి ఆయా కులాలకు చెందిన వారిని సంఘటిత పరిచి పార్టీ నాయకత్వం వహించాలనీ, ఆ పోరాటానికి మద్దతుగా అగ్రకులాల అనబడే వాటికి చెందిన పీడిత ప్రజలను సైతం సమీకరించి ప్రయత్నించాలనీ,  ఆ డాక్యుమెంట్ స్పిరిటు. పీడిత ప్రజలందరినీ వర్గ పునాదులపై సంఘటిత పరచడానికి అలాంటి సమీకరణ పెద్దగా తోడ్పడుతుంది. ఎన్ని కులాలు కింద విభజింపబడినా పీడితులు అంతా ఒకటేననీ, ఒకరినొకరు ఆదుకోవడానికి పూనుకోవటం ద్వారానే భూస్వాముల దౌర్జన్యాలనూ దోపిడీనీ ఎదుర్కోగలమనీ వారంతా భావిస్తారు. అలాగే వర్గ చైతన్యమూ, సంఘటిత శక్తీ, వారిలో పెంపొందుతుంది. కేవలం ఆర్థిక సమస్యలపై జరిగే పోరాటమే వర్గపోరాటమని  భావించటం గాని, సాంఘిక సమస్యలనూ ఆర్థిక సమస్యలనూ యాంత్రికంగా విడదీసి చూడటం గాని, సరి అయింది కాదు.   మన దేశంలోని కులవ్యవస్థ స్వభావాన్ని అనుసరించి కులాల సమస్య సారాంశంలో ఈనాడు వర్గ సమస్యయే. మన రాజకీయ తీర్మానాన్ని, అవగాహనను అనుసరించి, ప్రస్తుతం మన సమాజంలో కొనసాగుతున్న వివిధ వైరుధ్యాలలో చూడాలి.   దానికి విశాల జనసామాన్యానికి మధ్య వైరుధ్యం ప్రధానమైనది. ఈ వైరుధ్యం కులాల రూపంలో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. రైతాంగంలో ఫ్యూడల్ భూస్వాములు గానీ,  పెట్టుబడిదారీ భూస్వాములు గానీ,  సగటున ఆరు, ఏడు శాతానికి మించి ఉండరు.  నేటి కులాల ప్రకారం నూటికి 90 కి పైగా భూస్వాముల కుటుంబాలు అగ్రకులాలు అని చెప్పబడే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ కులాలకు చెందినవే. అలాగే వెనుకబడిన కులాలు అని చెప్పబడే యాదవ, చాకలి, మంగలి, పెరిక, గౌడ, మున్నేటి  కాపు వగైరా కులాలకూ, షెడ్యూల్ కులాలుగా పిలువబడుతున్న మాల, మాదిగ, నేతగాని, వగైరా కులాలకూ చెందిన కుటుంబాలు నూటికి తొంభై కి మించి కేవలం నిరుపేద రైతులు, వ్యవసాయ కూలీలు. అందులో ప్రత్యేకించి హరిజనులలో నూటికి 95 కుటుంబాలకు పైగా కేవలం వ్యవసాయ కూలీలుగానే జీవిస్తున్నారు.  అందువల్ల కుల ప్రాతిపదికపై చూస్తే ప్రజాస్వామిక విప్లవానికి, వ్యవసాయ విప్లవం, అగ్రకులాలు అనబడే వాటికీ, వెనకబడిన కులాల అనబడే వాటికీ మధ్యనే కొనసాగుతుందని బోధపడుతుంది. అందుకనే ప్రపంచమంతటా జాతుల సమస్య ఎలా సారాంశంలో వర్గ సమస్యయో.  అలా మన దేశంలో కుల సమస్య కూడా సారాంశంలో వర్గ సమస్యయే. అయితే బహిరంగంగా, ప్రజాస్వామిక విప్లవమన్నా, వ్యవసాయక విప్లవమన్నా,  అగ్రకులాలకు వ్యతిరేకంగా వెనుకబడిన కులాలు చేయవలసిన విప్లవమేనని సూటిగా ఎందుకు సిద్ధాంతీకరించరాదు. అలాంటి పిలుపు ఇవ్వకూడదు. భూస్వాములలో 90శాతం అగ్రకులాలు అనబడే వాటికి చెందియున్నారే గాని, ఆ కులాలకు చెందిన మొత్తం ప్రజానీకంలో అత్యధికభాగం ఏదో ఓ రూపంలో భూస్వాముల దోపిడికీ, లేదా అణిచివేతకూ, గురి అవుతున్న వారే అనే విషయాన్ని ఎంత మాత్రమూ మరవరాదు.  అలాగే వెనుకబడిన కులాలు అనబడే వాటిలో కూడా 90% నిరు పేద రైతులూ వ్యవసాయ కూలీలూ అయినా, అందులో నూటికి ఏ ఒకరిద్దరో భూస్వాములు కాని, దళారి లేదా  బ్యూరాక్రటిక్  వర్గాలకు చెందిన వారు గాని, లేక పోలేదు. పనికట్టుకుని పాలకవర్గాలు వెనుకబడిన కులాలలో అలాంటి ఏజెంట్లను సృష్టిస్తున్నాయి.  పీడిత వర్గాలను చీల్చడానికి పాలకవర్గాలకు సులువైన పద్ధతులలో ఇది ఒకటి. ముసలయ్యలూ, సంజీవయ్యలూ, జగ్జీవన్ రామ్ లూ అలాంటి బాపతే.   నూటికి ఇద్దరో ముగ్గురో హరిజనుల నుండి తయారయ్యే పెద్దపెద్ద ఆఫీసర్లూ, కాంగ్రెస్ సంస్థ నాయకత్వ స్థానాల్లోకి శాసనసభ స్థానాల్లోకి ఆ కులాల నుండి పాలకవర్గాలు పనిగట్టుకుని నెట్టుకొని వస్తున్న వారూ - అంతా అలాంటి సరుకే.  వెనుకబడిన కులాల ఉద్ధరణ గూర్చి ఎన్ని చిలక పలుకులు పలికినా, అలాంటి వారంతా ఆచరణలో పాలకవర్గాల ఏజెంట్లుగానూ, ఈనాటి అర్థ ఫ్యూడల్, అర్ధ వలస సమాజాన్ని చెక్కుచెదరకుండా యథాతథంగా సంరక్షించేందుకు నమ్మకమైన బంటులుగానూ ఉపకరిస్తున్నారు. ఇది మన కళ్ళముందు కనిపిస్తున్న యదార్థం. అందువల్ల వ్యవసాయ విప్లవం అగ్రకులాలు అనబడే వాటికీ, వెనకబడ్డ కులాల అనబడే వాటికీ మధ్య జరుగుతున్న విప్లవం కాదు.  అగ్ర కులాలు అనబడే వాటికి చెందిన పీడిత రైతాంగాన్నీ, వ్యవసాయ కూలీలనూ తమ వెనక నిలబెట్టుకోవడానికి వీలుగా భూస్వాములు మాత్రమే అటువంటి నిర్వచనం ఇవ్వగలరు.  పీడిత రైతాంగాన్ని చీల్చడం అనే కుట్రలో అటువంటి ప్రచారం ఒక భాగం మాత్రమే.
ఈ విషయాన్ని మరో వైపు నుండి కూడా చూద్దాం.
ప్రజాస్వామిక విప్లవం లో మధ్య తరగతి రైతులు మిత్రులనీ, ధనిక రైతులను తటస్థం చేయాలనీ మన వ్యూహం. అయితే నూటికి 90 మందికి పైగా ధనిక రైతులు, మెజార్టీ మధ్య తరగతి రైతులు అగ్రకులాలు అనబడే వాటికి చెందియున్నారు. కాబట్టి వ్యవసాయ విప్లవాన్ని అగ్రకులాలకు వ్యతిరేకంగా భావించడం ఎంత తప్పో, అగ్రకులాలు అనబడే వాటికి చెందిన భూస్వాములు వెనుకబడిన కులాలపై కొనసాగించే సాంఘిక దురంతాలను ఎదుర్కొనడంలో వెనుకంజ వేయడం కూడా అంతకంటే పెద్ద తప్పు. తరతరాలుగా బానిసలుగా జీవించడానికి అలవడ్డ కారణంగా ఇంతవరకూ ఎన్నో సాంఘిక దురాచారాలకు వారు తలవొగ్గి జీవిస్తున్నప్పటికీ, వారిలో వర్గ చైతన్యం, విప్లవ చైతన్యం పెంపొందే కొద్దీ, కేవలం కూలి రేట్లు, పాలేళ్ళ జీతాలు పెంచడం తోనే సంతృప్తి చెందరు. సాంఘికంగా తాము అందరిలాంటి మనుషులమేననీ, అందరితో సమానంగా బతికే అర్హత తమకు ఉందనీ వారు భావిస్తారు. వారిలో బానిసత్వం స్థానే పెరుగుతున్న వ్యక్తిత్వానికి అది చిహ్నం. అలాంటి వ్యక్తిత్వం పెరగకుండా విప్లవ చైతన్యం పెంపొందడం అసంభవం. వెనకబడిన కులాలు అనబడే వాటికి చెందిన పీడిత ప్రజానీకంలో క్రమంగా పెంపొందే ఆ వ్యక్తిత్వాన్ని అగ్రకులాలు అనబడే వాటిలో ఉన్న పీడిత రైతాంగం సమర్థించేలా మన పార్టీ కృషి చేయాలి.  అప్పుడే గ్రామాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా నిజమైన పీడిత ప్రజల ఐక్య సంఘటన ఏర్పడుతుంది. వెనుకబడిన కులాలు అనబడే వాటికి చెందిన వారు తెగించి పోరాడడం ద్వారానే అలాంటి పరిస్థితిని సృష్టించగలరు. అందుకు మనం చాలా ఓపికతో కృషి చేయాల్సిన అవసరం ఉన్న మాట వాస్తవమే గానీ, పట్టుదలతో కృషి చేస్తే అగ్రకులాలకు చెందిన పీడిత ప్రజలను అందుకు సంసిద్ధం చేయటం అసంభవమేమీ కాదు. కాబట్టి అగ్రకులాలు అనబడే వారు సాగించే సాంఘిక దురంతాలను ఎదుర్కోవాలనే విషయాన్ని, జనరల్ గా కుల వ్యవస్థ యొక్క అభివృద్ధి నిరోధక పాత్రతో ముడిపెట్టి తప్పించుకో ప్రయత్నించడం పొరపాటు. బలమైన భూస్వామ్య వ్యతిరేక గ్రామీణ పీడిత ప్రజల ఐక్య సంఘటనను నిర్మించడంలో తద్వారా విఫలత చెందుతాం. అందుకే "విప్లవానికి బాట" డాక్యుమెంటులో,  మనదేశంలో  ప్రజాస్వామిక విప్లవం విజయవంతం అవడానికి దీర్ఘకాలం సాయుధ విప్లవం అని భావించడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ ఇవ్వబడిన 11 అంశాలలోని భాగంగా ఎనిమిదో అంశంలో,  జాతుల అణచివేతకు తోడు వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన కోట్లాది ప్రజలపై ఈ దేశంలో సాంఘికమైన అణిచివేత కొనసాగుతోంది,  వీరిలో అత్యధికభాగం గ్రామీణ కార్మికులు, అర్ధ కార్మికులే, వీరు శతాబ్దాల తరబడి అత్యంత దారుణమైన సాంఘిక అణిచివేతకు గురవుతున్నారు, అని రాయబడింది. ఈ అణచివేత సారాంశంలో వర్గ సంఘర్షణలో భాగమే. దీన్ని జనరల్ కుల సమస్యతో ముడిపెట్టి చూడటం సరికాదు.
ఇక నాలుగో విషయం - యాదృచ్చికంగా ఎదురయ్యే కుల సమస్యల ఎడల మనం ఎలాంటి వైఖరి అవలంబించాలనేది. యాదృచ్ఛికమైనదైనా లేక ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టబడింది అయినా, ఆ సమస్య స్వభావం ఏమిటి? దాని వెనక ఉన్న శక్తులేవి? దానినుండి యే యే వర్గాలు ఇలాంటి ప్రయోజనాన్ని పొందనాకాంక్షిస్తున్నాయి ? అనే విషయాల పరిశీలనపై మనం అవలంబించాల్సిన వైఖరి ఆధారపడి ఉంటుంది. కుల దురహంకారాన్ని ఎదుర్కోవడం, మరో కులానికి హాని కలిగించనంతవరకూ వివిధ కులాల ఆచారవ్యవహారాలను పరస్పరం గౌరవించుకునే చైతన్యాన్ని అన్ని కులాలకు చెందిన, ముఖ్యంగా అగ్రకులాలు అనబడే వాటికి చెందిన, పీడిత ప్రజలలో పెంపొందింప చేయడం, ఆయా సమస్యలను రెచ్చగొట్టడానికి వెనుకగల భూస్వాముల వర్గ ప్రయోజనాలను బహిర్గతపరచి వారికి వ్యతిరేకంగా పీడిత ప్రజల్ని సమైక్యం చేయడం- అలాంటి సమస్యల పరిష్కారంలో అవలంబించాల్సిన విధానానికి ప్రాతిపదికగా తీసుకోవాలి.   కొన్ని సమస్యలు, అనుకోకుండానే, యాదృచ్ఛికంగానే, వివిధ కులాలకు చెందిన పీడిత ప్రజలలో ఈనాటికీ ఉన్న కుల చాదస్తం మూలంగా ఉత్పన్నం కావచ్చు, మరి కొన్ని సమస్యలు పీడిత ప్రజల సమైక్య ప్రతిఘటన శక్తిని దెబ్బ తీయడానికి భూస్వాములు తలపెట్టే కుతంత్రాలు వల్ల తలఎత్తవచ్చు. ఎలా ఉత్పన్నమైనా మనం ఆ సమస్యలను దాటవేయలేం,  చూచి చూడనట్టు నటించలేము. తప్పక వాటిని పరిష్కరించ పూనుకోవాలి. అయితే వైరుధ్యం స్వభావాన్ని బట్టి ఒక్కొక్క వైరుధ్యాన్ని ఒక్కొక్క రీతిలో పరిష్కరిస్తాం. కంచికచర్ల కోటేశును ఏదో ఒక చిన్న సాకుతో పందిరి గుంజకు కట్టి కాల్చిన  ఉదంతం కానీ, తమిళనాడులో కీలవేలన్మనిలో మొత్తం మాలపల్లెను క్రూరంగా తగలబెట్టి అనేకమందిని సజీవంగా ఆహుతి చేసిన ఉదంతం గాని అయితే, ఆ సమస్యకు కారకులైన భూస్వాముల దౌర్జన్యాలనూ, ఆ చర్యలకు తలపడటంలో వారి వర్గ ప్రయోజనాలనూ గ్రామీణ పీడిత ప్రజానీకం అంతటిలోనూ బహిర్గతం చేసి, వారందరినీ  సంఘటితపరచి, కంటికి కన్ను పంటికి పన్ను రీతిలో ప్రతీకారం తీర్చుకోవడం ద్వారానే ఆ సమస్యను పరిష్కరిస్తాం. కొన్ని గ్రామాలలో ప్రజలు త్రాగటానికి చెరువు నీరు ఉపయోగిస్తారు. వేసవికాలం చెరువులు ఎండిపోయి అచ్చటి ప్రజలు ఒకటి, రెండు నెలలు నీటికి ఎంతో ఇబ్బందికి గురి అవుతారు. ఒకటో రెండో బావులు ఉంటే, అవి వాస్తవానికి పబ్లిక్ బావులే అయినా, అందులో నీరు తోడుకోవడం హరిజనులకు ఆచార రీత్యా నిషిద్ధం కావడంతో, వారి సమస్య మరింత ఇబ్బందిగా తయారవుతుంది. నీరు లేకుండా బ్రతకడం ఇబ్బంది కనుక అలాంటి సమయాలలో తగవులు పెరగటం చాలా తేలిక. పీడిత ప్రజల మధ్య కులతత్వాన్ని రెచ్చగొట్టి  తగవులను పెంచి చీల్చడానికి భూస్వాములకు అలాంటి సమయాలు చాలా అనుకూలమైనవి. పీడిత ప్రజలలో కుల వ్యవస్థ పేరుతో గూడుకట్టుకొని ఉన్న మూఢత్వం భూస్వాములకు అలాంటి సమయాల్లో చక్కటి ఆయుధంగా ఉపకరిస్తుంది.  అలాంటి సందర్భంలో చెలరేగే  అగ్రకులాలు అనబడే వాటికి చెందిన పీడిత ప్రజానీకానికి నచ్చచెప్పడం ద్వారా తాత్కాలిక పరిష్కారంగా హరిజనులందరికీ నీళ్ళు తోడించి పోయించే ఏర్పాటు చేయించడం ద్వారానూ, శాశ్వత పరిష్కారంగా సమిష్టి కృషితో వారికి కూడా ప్రత్యేకంగా బావి ఏర్పాటు చేయడం ద్వారానూ పరిష్కరిస్తాం. తద్వారా పీడిత ప్రజలు చీలిపోకుండా నిలబెట్టి భూస్వాముల కుతంత్రాలు ఫలించ కుండా చేస్తాం.
దీనినే ప్రజల మధ్య వైరుధ్యాలను పరిష్కరించే పద్ధతి అంటాం. ఆ విధంగా యాదృచ్చికంగా గాని, ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టడం ద్వారా గాని, ఉత్పన్నమయ్యే సమస్యలన్నింటినీ, భూస్వాములకు వ్యతిరేకంగా పీడిత ప్రజలందరి సమైక్య లక్ష్యంతో పరిష్కరించడం ద్వారా, వ్యవసాయ విప్లవాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అంతేగాని చూచి చూడనట్లు సమస్యను వదిలివేయటం కూడదు.
ఇలాంటి సమస్యల ఎడల రివిజనిస్టుల వైఖరికీ విప్లవకారుల వైఖరికీ గల తేడా ఏమిటనేది ఐదవ అంశం. అనేక ఇతర సమస్యలలో మాదిరిగానే రివిజనిస్టులు, ఫారంకు (స్వరూపం, పద్ధతి) ప్రాముఖ్యతనిచ్చి కంటెంటు (విషయం) పట్ల ఉదాసీనత వహిస్తారు. ఇలాంటి సమస్యలేవీ ఎదురైనా అవన్నీ కుల సమస్యలుగా పేర్కొని అసలు సమస్యలలో తల దూర్చకుండా తప్పించుకోడానికి ప్రయత్నిస్తారు. వెనకబడిన కులాల సమస్యలన్నీ సారాంశం లో వర్గ సమస్య లేనన్న యదార్థాన్ని వారు గుర్తించరు. తీరా సమస్య తీవ్రమై భూస్వాములు ఒక పక్షం గానూ, వెనుకబడిన కులాలకు చెందిన వారు మరో పక్షం గానూ చీలిపోయి, అగ్రకులాలకు చెందిన పేద, మధ్యతరగతి వారు కొంతమంది తటస్తులై, మరికొందరు భూస్వాముల పక్షం వహించి,  పోరాటం తీవ్రతరమైన స్థితిలో, అగ్రకులాలకు చెందిన రివిజనిస్టులంతా, "హరిజనులు మరీ మితిమీరి పోతున్నారు",  "అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు" లాంటి సాకులు చెప్పి,  చివరకు భూస్వాముల పక్షం వహిస్తారు. (కమ్యూనిస్టు పార్టీకి బలమైన గ్రామం అనుకున్న చోట యదార్ధంగా జరిగిన సంఘటన).   పాలకవర్గాల ఏజెంట్లుగా  కార్మిక వర్గ బురఖాలో దూరిన రివిజనిస్టుల పాత్ర వర్గపోరాటం మొత్తంలో ఎలా ఉంటుందో, ఈ సమస్యలోనూ అలాగే ఉంటుంది. అంతిమంగా వారు భూస్వాముల సేవలోనే తరిస్తారు. విప్లవకారులు అలాకాకుండా వెనకబడ్డ కులాలు అనబడే వాటిపై సాంఘికంగా జరుగుతున్న దాడులను సారాంశంలో వర్గ సమస్యలుగానే భావించి, పైన చెప్పిన రీతిలో పరిష్కరించడానికి పూనుకుంటారు. అదే తేడా. 
ఇక ఆఖరు విషయం - రివిజనిస్టు పిరియడ్ లో ఈ సమస్యకు సంబంధించిన ఆచరణ పర్యవసానం ఏమిటి? అనేది.   ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ మొదట డెల్టా ఏరియాలోని భూస్వాములు, ధనిక రైతుల కుటుంబాల నుండి వచ్చిన యువకులలో పుట్టింది.  వారి నాయకత్వం క్రింద గ్రామీణ యువకులలో ఒక బలమైన శక్తిగా తయారైన తర్వాత వ్యవసాయ కూలీలలోకి, మెట్ట ప్రాంతంలోని రైతాంగంలోకి అది విస్తరించింది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు కూడా పెద్ద పెద్ద భూస్వాముల కుటుంబాలకు చెందిన యువకుల ద్వారానే పార్టీ విస్తరించింది.
రెండో ప్రపంచ యుద్ధం పూర్తి అయ్యేనాటికి (1945) డెల్టా జిల్లాలోని (అప్పట్లో  ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి అదే గుండెకాయ లాంటిది) హరిజనులలో   గమనించదగిన స్థాయిలో  ఆదరాభిమానాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అభిమానం వెనక, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా వ్యవసాయ విప్లవంలో తమను శక్తివంతంగా నడిపించగల నాయకత్వం అనే భావం కంటే, ఇంతకు పూర్వం ఆ గ్రామంలో తమను పీడిస్తున్న భూస్వాములతో పోల్చగా వీరు మంచి వారు అనే భావమే హెచ్చు. మంచి విషయాలు చెప్పే బోధకులు గానే వారిలో గౌరవం ఏర్పడింది తప్ప,  తమలో ఒకరిగా కానీ, తమకు నిజమైన నాయకులుగా కానీ, వారు ఎన్నడూ భావించలేదు. అందుకు కారణం ఆనాటి హరిజనులలో కమ్యూనిస్టు పార్టీ పట్ల ఏర్పడిన గౌరవం. అచ్చటచ్చట రోజు కూలీ సమస్యల పైనా, పాలేళ్ళ జీతాల పైనా కొన్ని పోరాటాలు నడిపినప్పటికీ, ప్రధానంగా అది పాత భూస్వాములతో పోల్చి చూస్తే వారు అవలంబించిన లిబరల్ ధోరణి మూలంగానూ, జనరల్ సోషలిజాన్ని గూర్చి చేస్తున్న ప్రచారం ద్వారానూ, తదితర సంస్కరణ కార్యకలాపాల ద్వారా ఏర్పడినదే తప్ప,  సునిశితమైన వర్గ పోరాటాల ద్వారా ఏర్పడింది కాకపోవటమే. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం తాలూకాలో మాత్రం వ్యవసాయ కూలీలతో కొంతవరకు వర్గ పోరాటాల పునాదిపై అలాంటి సంఘటిత శక్తి ఏర్పడింది.  అయితే అచట నాయకత్వంలో ఉన్న చిన్న చిన్న లోపాలను సాకుగా తీసుకుని రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ నాయకత్వం పనిగట్టుకుని ఆ ఉద్యమంలో మిలిటేన్సీని చంపేసే వరకూ నిద్రపోలేదు.  తరువాత క్రమంగా భూస్వాములలోని ఒక సెక్షన్ తో కలిసి పోయి, చాలా గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ మెజార్టీ పార్టీ గానో, లేక బలమైన ప్రత్యర్థి పార్టీ గానో రూపొందింది. అదే కాలానికి వ్యవసాయ కూలీలలో  పెంపొందిన చైతన్యం, రివిజనిస్టు నాయకత్వం మూలంగా ఎన్నో పరిమితులకు లోనై ఉన్నప్పటికీ, వారిలో ఎంతో కొంత వ్యక్తిత్వం, సంఘటిత శక్తి పెంపొందడం కూడా నిర్వివాదమైన విషయం. అందువలన గ్రామాలలో వర్గపోరాటాలు కూడా తీవ్రతరం అయినాయి.  కానీ అప్పటికే ఒక సెక్షన్ భూస్వాములతో కలిసిపోయిన కమ్యూనిస్టు పార్టీ, ఆ పోరాటాలకు నాయకత్వం వహించ లేకపోయింది సరికదా, భూస్వాములతో ఏర్పడ్డ ఐక్య సంఘటనకు నష్టదాయకంగా భావించి, వాటి ఎడల విముఖత ప్రదర్శించడం కూడా ఆరంభమైంది. అన్ని మురుగు కాలువలూ సముద్రంలో లీనమైనట్టు, అంతలోనే ప్రారంభమైన తెలంగాణ రైతాంగ మహా విప్లవంలో ఆ  లొసుగులన్నీ కలిసి పోయాయి.
కానీ రివిజనిస్టు నాయకత్వం ఆ విప్లవాన్ని వెన్నుపోటు పొడిచి విచ్ఛిన్నం చేసిన తర్వాత, తిరిగి యధాస్థితికి దాపురించింది. పోరాట కాలంలో ద్రోహం చేసిన నాయకత్వంలో క్రింది నుండి పైకి తీసి వేశారు.
తెలంగాణ పోరాట ప్రభావంతో వ్యవసాయ కూలీలలో జనరల్ గా వర్గ చైతన్యం హెచ్చింది. అంతవరకూ గ్రామాలతో సంబంధం లేకుండా దూరంగా నెట్టబడ్డ హరిజనులు, గ్రామీణ జీవితం రూపురేఖలు దిద్దడంలో తాము కూడా ఇతరులతో పాటు సమానత్వాన్ని డిమాండ్ చేసే స్థితికి తయారైనారు. హరిజనులలో  పెంపొందుతున్న ఈ చైతన్యం విప్లవకారులకు ఎవరికైనా ఉత్తేజాన్నిస్తుంది. కానీ ఆ నాటి రివిజనిస్టు పార్టీకి అది చీమలు పాకినట్లు అయింది."లేబర్ అరాచకం"అని దానికి నామకరణం చేశారు. ఆ చైతన్యాన్ని అణిచివేయడానికి ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు వల్లించారు. "ప్రపంచ కార్మికులారా! ఏకంకండి"! అని చిలక పలుకులు పలికిన ఆనాటి 
నాయకమ్మన్యులు చివరకు గ్రామాల్లో ఉండే అన్ని కులాలకు చెందిన పీడితుల అంతా ఏకం కాగా ఆ సంఘటిత శక్తిని చూసి బెదిరిపోయి,  దాన్ని అణచడానికి  భూస్వామ్య వర్గంలో గల వైరుధ్యాలన్నింటిని అప్పటికప్పుడు  పరిష్కరించి, సమైక్య పరచి, ఆ దుష్ట కూటమి కి నాయకత్వం వహించే దుస్థితికి దిగజారారు. ఈ విప్లవ ద్రోహమంతా కుల సమస్యలలో తలదూర్చరాదనే పేరుతోనే జరిగింది.
పర్యావసానంగా రివిజనిస్టు పార్టీలు వ్యవసాయ కూలీల నుండి, ప్రధానంగా హరిజన వ్యవసాయ కూలీల నుండి, రాను రాను మరింత దూరం అయిపోయాయి. ఆచరణలో, నిర్మాణంలో, ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి నకల్ గానే తయారయ్యాయి. ఏ కోణం నుంచి చూసినా రివిజనిస్టుల ప్రయాణం విప్లవ విచ్ఛిన్నం వైపే ఉంటుంది. భూస్వాముల సేవకు అంకితమైన వారి ఆచరణ అంతకంటే భిన్నంగా ఉండడం అసంభవం. సాంఘిక దురంతాలను ఎదుర్కోవడంలో కూడా వారి ఆచరణ అంతే. రివిజనిస్టు కమ్యూనిస్టులు ముసుగులో ఉన్న భూస్వాముల ఏజెంట్లు కనుక బుద్ధి పూర్వకంగానే అలా వ్యవహరిస్తారు. అందుకు భిన్నంగా "విప్లవానికి బాట" డాక్యుమెంట్ వ్యక్తపరిచినట్టు, వెనకబడ్డ కులాలపై అగ్రకులాలు అనబడే వాటికి చెందిన భూస్వాములు కొనసాగించే సాంఘిక దురంతాలను సారాంశంలో వర్గ సమస్యలుగానే భావించి, ప్రజాస్వామిక విప్లవం లో భాగంగానే వాటి ని ఎదుర్కొనడంలో ముందు నిలబడాలి, అగ్రకులాలకు చెందిన పీడిత ప్రజలందరినీ ఆ పోరాటంలో మద్దతుగా నిలబెట్టడానికి శక్తి వంచన లేని కృషి చేయాలి.



నడెవు దొందె భూమి కుడివు దొందె నీరు
నుడువగ్ని మొందె తిరలు
కులగోత్ర నడువె యత్తణదు సర్వజ్ఞ.
(మనుష్యులందరూ ఒకే భూమి మీద నడుస్తూ,
ఒకే నీరు తాగుతూ చివరకు ఒకే నిప్పు లో కాలి నశిస్తుంటే
 ఇక కుల గోత్రాల గోప్ప ఎక్కడిది ?)