P1 ప్రయాణం
కవిత : తన ముగ్ద సుకుమార రూపం...
నింగిలోన నక్షత్రాలు మురిసిపోయాయి ,
పలకరింపుకు కోయిల అసూయతో గొంతు సవరించుకుంది వింతగా
ప్రకృతి పరవశించి పులకరిస్తోంది.
మేఘ ఘర్జన, విద్యుత్ ఘాతమైంది.
అనంత శక్తిని నాలో ప్రసరింప చేసింది.
నా పేరు రామమోహన్. అది 1975 జులై నెల . నా వయస్సు 14 సంవత్సరాలు. నేను 9వ తరగతి చదువుతున్నా. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు నడక దారిని పట్టాను. 6వ తరగతి చదివే ఒక చిన్న అబ్బాయి నా ముందే ప్రత్యక్షమయ్యాడు. తాను తన క్లాస్‌మేట్ గురించిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు.
“రోజూ మా గర్ల్‌ఫ్రెండ్‌తో కలసి ఇంటికి వెళ్తాం. కానీ ఈ రోజు రాలేదు,” అని అతడు చెప్పాడు.
“అవునా?” అని నేను అడిగాను.
మేమిద్దరం మాట్లాడుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి, అక్కడినుండి మా తాలుకు గమ్యాలకు చేరుకున్నాం. ఆ రోజు గడచింది. మరుసటి రోజు,
స్కూల్ ముగిసింది. నేను మళ్లీ నడక దారిన ఇంటికి బయలుదేరాను. అప్పుడే నిన్న కలిసిన ఆ అబ్బాయి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అతడి పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది.
“ఈమె ఝాన్సీ. నా క్లాస్‌మేట్. 6వ తరగతి ,” అని అతడు పరిచయం చేశాడు.ఝాన్సీ కొంచెం మొహమాటంతో ఉన్నట్టుగా కనిపించింది. ఆమె తలదించుకుని నన్ను గమనించింది.
నేను మామూలుగానే నవ్వి, “హాయ్” అన్నాను.ఆరోజు ముగిసింది.ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ (వేర్వేరు గమ్యాలు) ఇంటికి చేరాము.
(బస్సు కూడా ఎక్కుతాము 15 పైసలు టికట్టు)
తరువాత రోజులు మేమిద్దరమే. ఝాన్సీ నేను,ఇంటికి వెళ్లేప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం.
రోజులు ఆనందభరితంగా గడుస్తున్నాయి కలిసి స్కూల్‌కు రావడం, కలిసి ఇంటికి వెళ్ళడం మాకు దినచర్యగా మారింది. మా అనుబంధం క్రమంగా బలపడింది.
ఒకరోజు స్కూల్ అయినాక , బస్సులో ఝాన్సీ నేను కలిసి ఇంటికి వెళ్తున్నాము. తను ముందే సీటులో కూర్చొంది. తన పక్కన ఉన్న సీటును చూపిస్తూ, "ఇక్కడ కూర్చో," అని నన్ను పిలిచింది. తన మాటలు వీనుల విందుగా అనిపించాయి. నేను పక్కన కూర్చున్నప్పుడు మా చేతులు స్వల్పంగా తాకాయి.ఆ క్షణం నాకు సంతోషం, ఆనందం అనుభూతి ఒకేసారి కలిగాయి. నా మనస్సు ప్రేమతో నిండిపోయింది , మనసు లో ప్రశాంతత . ఆ బస్సు ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది
మా బంధం ఓ అమాయకత్వపు తీయని గాథగా కొనసాగింది...
ఋతువులు మారుతున్నాయి. వసంతం పూల సుగంధాన్ని చుట్టుముట్టగా, వర్షాకాలం చిరు జలదారలతో మనసుల్ని తడిమింది. చలికాలం చల్లని గాలులతో కొత్త అనుభూతులను జతచేసింది. ఎండాకాలం, వెచ్చని రాత్రుల నీడన, ఇద్దరి అనుబంధం మరింత బలపడింది.
రాత్రి నిద్రలోకి జారుకున్న నాకు తనతో గడిపిన తరుణాలు ఊసుల అలజడి
కానీ, ఉదయం సూర్యుడు ఆకాశపు పల్లకిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను మెలకువలోకి లాగాడు.
తన జ్ఞాపకాలు మెదడు పొరల్లో మెదిలి,
నా మనసును తట్టాయి .ఝాన్సీ ని స్కూల్‌లో కలవాలన్న కోరిక ,చిలిపి వెలుతురు కళ్ళలోకి పడుతుంటే.
ప్రతి క్షణం తనతోనే నడుస్తున్న అనుభూతితో నేను నా జీవిత ప్రయాణం మొదలెట్టాను.