Showing posts with label Telusukundam హల్దార్ నాగ్. Show all posts
Showing posts with label Telusukundam హల్దార్ నాగ్. Show all posts
తెలుసుకుందాం హల్దార్ నాగ్
collectiom
హల్దార్ నాగ్. మట్టికాళ్ళ మహాకవి. ప్రముఖ కవి గుల్జార్ ఈయన అభిమాని. చదివింది మూడవ తరగతి. ఉడకబెట్టిన పల్లీలు, శనగలు అమ్మడమే ఈయన బ్రతుకుతెరువు. అయితే ఈయన కవిత్వాన్ని గుర్తించి ప్రభుత్వం ఆయన్ని సత్కరించి ఇచ్చిన పురస్కారం పద్మశ్రీ. విచిత్రం ఏంటంటే, ఆ అవార్డు తీసుకోవడానికి ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆయన్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు, ఈయన బస చేయాల్సిన హోటల్ కి వెళ్ళినప్పుడు ఈయన ఎవరో మామూలు వ్యక్తి అనుకొని అక్కడి కాపాలాదారుడు ఈయన్ని లోనికి పంపకుండా పక్కకి నెట్టేశాడు. నేనూ మొదట ఆశ్చర్యపడినా, ఈయన ఫోటోలు చూసాక అర్థమైంది ఈయన ఎంత సామాన్యంగా ఉంటారో..
ఈయన రచనలపై ఇప్పటికే ఎనిమిది పి.హెచ్.డి లు జరుగుతున్నాయి. ఈయన రాసిన క్లాసిక్ కావ్యాంజలి కావ్యం సంబల్పూర్ యూనివర్సిటీలో పాఠ్యాంశం.ఈయన ఇతర రచనల్లో కొన్ని అక్కడి పాఠశాలల్లో పాఠ్యాంశములు. బీబీసీ ఈయనపై డాక్యుమెంటరీ తీసింది. ఇంతటి ఘనమైన ఈయన ప్రస్తుతానికి పునాదైన గతం తెలుసుకుంటే మనసు చివుక్కుమంది, ఈయన పుట్టిన పదేళ్లకే తండ్రి చనిపోయాడు, ఆ మరుసటి సంవత్సరమే తల్లీ చనిపోయింది. మూడవతరగతి వరకూ చదివిన ఈయన, ఆ తరువాత బడి మాని అక్కడే హోటల్లో అంట్లు తోమేవారు. అలా చాలా కాలం గడిపాక, ఆ ఊరి సర్పంచ్ ఆయన్ని ఘెన్స్ హై స్కూల్లో వంటమనిషిగా చేర్పించారు. అక్కడే పదహారేళ్లు పనిచేసారు. ఎనిమిది రూపాయలతో మొదలైన జీతం, మానేసేటప్పటికి 40 రూపాయలు అయ్యింది. అయితే అక్కడే అయన పిల్లలు చదివే పాఠాలు విన్నాడు, అడిగి మరీ చదివించుకున్నారు, అర్థాలు తెలుసుకున్నారు. వెయ్యి రూపాయలు అప్పుతో ఆ స్కూల్ బయటే ఒక స్టేషనరీ షాప్ పెట్టుకున్నారు. అప్పుడే ఆయనకి అభిమన్యు సాహిత్య సంసద్ అనే గ్రూప్ తో పరిచయం ఏర్పడింది.
మనసులోని భావాలన్నింటినీ తన కోసలి భాషలో పద్యాలుగా, కవితలుగా, తనకు తాను లేఖలుగా రాసుకునేవారు. అలా రాసిన “ధోడో బగ్గాచ్” అనే కవిత అక్కడి లోకల్ పత్రికలో ప్రచురితమైంది. ఆ ఒక్క కవితతోనే తన అక్షరం బలం ఏమిటో అందరికి తెలిసేలా చేసి, సాహిత్యాభిమానులందరినీ తన కలం వైపు చూసేలా చేశారు.
ఇప్పటికి 20 గ్రంథాలు రాసారు. తన బాల్యం, ప్రకృతి, పురాణ పాత్రలు, సంఘంలోని వివక్ష, జానపద శైలి, అందరికీ అర్ధమయ్యే సామాన్య భాష యావన్నీ కలగలిపితే హల్దార్ నాగ్ గారి కవిత్వం. ఏ పుస్తకంలో ఏ కవితని అడిగినా టక్కున గుర్తుతెచ్చుకొని ఆశువుగా చెప్పే ఈయన ధారణ చూసి అందరూ ఆయన్ని ఆశుకబి. లోక కబిరత్న అని పిలుచుకుంటారు. ఇలాంటి ఈ మట్టి మనిషి చేతిలో పూసిన కొన్ని కవితా సుమాలలోని కొన్ని వాక్యాలు..
“నా జీవితమంతా ఒక తిరుగుబాటు, అయితే నా శత్రువు పేరు ఆకలి”
“ఈ మట్టి మీద నడిచేటప్పుడు సమస్త భూగోళం మీద నడుస్తున్నట్టు భావించు”
“నీవైన సుమధురమైన మాటలతో అందరినీ నీ వారిగా చేసుకో, ప్రపంచాన్ని నీ సొంత ఇంటిగా మార్చుకో”
“కష్టాన్ని కూడా కన్నతల్లి ఆశీర్వదంలా భావించు”
“విషం చిమ్మిన చోటే, కాలం నీకోసం అమృతాన్ని దాచిపెట్టి ఉంటుంది. వెతికి చూడు”
[ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే, మన్నించి తెలుపగలరు]
ఇట్లు
కవనమాలి CONCEPT
( development of human relations and human resources )
Subscribe to:
Comments (Atom)