Showing posts with label వేమన 97. Show all posts
Showing posts with label వేమన 97. Show all posts

వేమన 97 *(203-207) part II

వేమన భావజాలం 

పద్యము – 203 తాత్విక సామజిక 

కడక నింద్రియముల గట్టి వేయగ లేక,
చావు వచ్చునపుడు సన్యసించు;
నాత్మజితము లేక నందునా మోక్షము?
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం

జీవితమంతా ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకుండా, చివరి సమయంలో మాత్రమే సన్యాసం స్వీకరించినా ప్రయోజనం లేదు. మనస్సును, ఇంద్రియాలను జయించినప్పుడే మోక్షం సాధ్యమవుతుంది.


పద్యము – 204 తాత్విక 

అధిక సూక్ష్మమైన ఆనందమెరుగక,
మతియు లేక చదివి మగ్నుడయ్యే;
నతి రహస్యమెల్ల నాజనుడెరుగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం

చదువు మాత్రమే సరిపోదు. లోతైన సత్యాలను గ్రహించే వివేకం లేకుంటే, ఎంత చదివినా పరమార్థ జ్ఞానం లభించదు.


పద్యము – 205 తాత్విక 

కడకనఖిలమునకు నడి నాళమందున్న
వేగుచుక్క వంటి వెలుగు;దిక్కు 
 వెలుగు కన్న దిక్కు వేరెవ్వరున్నారు?
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం

ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న దైవజ్యోతి సర్వసృష్టికి మూలం. ఆ పరమాత్మ కాంతికి మించిన శక్తి మరొకటి లేదు.


పద్యము – 206 తాత్విక 

రామనామ పఠనచే మహి వాల్మీకి
పరగ బోయయయ్యు బాపడయ్యె;
కులము ఘనము గాదు, గుణము ఘనంబురా.
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం

వాల్మీకి మొదట దొంగ అయినప్పటికీ, రామనామ స్మరణతో మహర్షిగా మారాడు. గొప్పది కులం కాదు; మంచి గుణాలే మనిషిని మహోన్నతుడిగా నిలబెడతాయి.


పద్యము – 207 ప్రేరణ 

కలిమి గల్గనేమి కరుణ లేకుండెనా,
కలిమి యేల నిలుచు కర్ములకును?
తేనె గూర్చి ఈగ తెరువున బోవదా?
విశ్వదాభిరామ వినుర వేమ.

తాత్పర్యం

సంపద ఉన్నా దయ లేకుంటే ఆ సంపద నిలవదు. సంపదకు కరుణ, దానం, సద్గుణాలు తోడైతేనే అది సమాజానికి మేలు చేస్తుంది.

CONCEPT ( development of human relations and human resources )